సినిమాకి ‘మార్కెట్’ పెరిగింది | Director Sukumar Exclusive Interview | Sakshi
Sakshi News home page

సినిమాకి ‘మార్కెట్’ పెరిగింది

Published Tue, Jan 28 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

సినిమాకి ‘మార్కెట్’ పెరిగింది

సినిమాకి ‘మార్కెట్’ పెరిగింది

  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో సినిమా రంగంలో మార్కెటింగ్ వనరులు కూడా విస్తృతంగా పెరిగాయని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ అన్నారు. అంగరలో శిల్ప కళాకారుడు పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి కుమారుడు నాయుడు నివాసంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు సుకుమార్ సోమవారం సతీసమేతంగా వచ్చారు. ‘కరెంట్’ చిత్ర దర్శకుడు  ప్రతాప్ కూడా సుకుమార్‌తో ఉన్నారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో సుకుమార్ ముచ్చటించారు. 
 
  వన్ చిత్రం విజయంపై మీ కామెంట్?
   ఈ సినిమా ద్వారా ఏది చెప్పాలనుకున్నానో అది చెప్పానన్న సంతృప్తి పొందాను. నా అన్ని సినిమాల్లోకెల్లా వన్‌కి ఇండియాతో పాటు యూఎస్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి.  
 
  సినీ రంగం పరిస్థితి ఎలా ఉంది?
   సినిమా మార్కెటింగ్ రంగం బాగా అభివృద్ది చెందింది. గతంలో సినిమా అంటే థియేటర్‌కు వెళ్లి చూడటమే అన్నట్టుండేది. టెక్నాలజీ పెరగడంతో మల్టీ ప్లెక్స్‌లు వచ్చాయి. ఇతర దేశాల్లోనూ తెలుగు సినిమా విడుదల చేసే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. 
 
  మీ సినిమాలు ఆలస్యం అవుతాయనే విమర్శ ఉంది కదా..? 
  వన్ సినిమాను 2013లోనే ప్రారంభించాం. సమంత మూడు నెలలు పాటు సిక్ కావడం, మహేష్‌బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. ప్రతి సినిమా ఆలస్యానికీ ఏదో ఒక కారణం ఉంటుంది. 
 
  మీరు నిర్మాణ రంగంపై దృష్టి పెట్టారేమిటి? 
 తక్కువ బడ్జెట్‌తో మంచి సినిమాలు నిర్మించడం ద్వారా కొత్త దర్శకులకు అవకాశం కల్పించడం నా ఉద్దేశం. అందుకే ‘సుకుమార్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థను స్థాపించాను.
 
  మీ బ్యానర్‌పై తీసే సినిమాల వివరాలు? 
 మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ప్రతాప్ (కరెంట్ ఫేం) దర్శకత్వంలో ఫిబ్రవరిలో ఒక సినిమా ప్రారంభమవుతుంది. తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు ఆలోచిస్తున్నాం. 
 
   మీ సినీ ప్రస్థానం గురించి చెబుతారా?
   మాది మల్కిపురం మట్టపర్రు. చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, బుర్రకథలు ప్రదర్శించేవాడిని. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ సినిమాలుఆసక్తిగా చూసేవాడిని. ఆ ఆసక్తే సినిమా రంగంలోకి నన్ను పురిగొల్పింది.
 
 ఒడిదుడుకులు ఎదుర్కొన్నారంటారు కదా.. 
 1999లో సినిమా రంగంలోకి వచ్చాను. అమ్మ, నాన్న సపోర్టు ఇచ్చారు. ఎడిటర్ మోహన్, వీవీ వినాయక్ వద్ద పనిచేశాను. దిల్ సినిమాకు అసిస్టెంటు డైరక్టర్‌గా పనిచేశాను. కష్టాలు అనుభవించిన వ్యక్తిగా మా నాన్న, అన్నయ్యలు, కుటుంబ సభ్యులు నాకు తోడ్పాటునిచ్చారు. ఇబ్బం దులు ఉన్నప్పుడు ఆదిత్య క ళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లాను. 
 
   మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా పేరుతెచ్చిన సినిమా ఏదంటే ఏం చెబుతారు?
  పనిచేసిన వ్యక్తిగా అన్ని సినిమాలు సంతృప్తిని ఇచ్చాయి. మహేష్‌బాబు సినిమా వన్ కు ఎక్కువ ప్రశంసలు వచ్చాయి.
 
 ఎన్టీఆర్‌తో యాక్షన్ ప్రేమకథ 
 మట్టపర్రు (మలికిపురం) :  జూనియర్ ఎన్టీఆర్‌తో  యాక్షన్ ప్రేమకథాచిత్రం తీస్తున్నట్టు దర్శకుడు బి.సుకుమార్ తెలిపారు. స్వగ్రామం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మే నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందన్నారు. ‘వన్ చిత్రం సక్సెస్ అయింది. హీరో మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కూడా ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement