టీడీపీ జిల్లా అధ్యక్షుని
ఎంపికపై అసంతృప్తి
అశోక్ తీరును తప్పు
పడుతున్న పార్టీ శ్రేణులు
అవినీతిని అందల
మెక్కించారని ఆరోపణలు
క్యాడర్‌కు తప్పుడు సంకేతాలిచ్చారని పెదవి విరుపు
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
మునుపెన్నడూలేని విధంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై విమర్శలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. ద్వారపురెడ్డి జగదీశ్‌ను మరోసారి నియమించడాన్ని మెజా ర్టీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు మళ్లీ పగ్గాలు అప్పగించి కేడర్‌కు తప్పుడు సంకేతాలిచ్చారని వాపోతున్నాయి. పార్టీ పెద్ద దిక్కుగా భావిస్తున్న అశోక్ గజపతిరాజు తీరును సైతం తప్పు పడుతున్నాయి. అవినీతిని ప్రోత్సహించరు. ఆయనేం చేస్తే అదే కరెక్టు. ఇదీ అశోక్‌గజపతిరాజుపై పార్టీ శ్రేణులకు ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయం. కానీ తొలిసారిగా ఆయన తీరును ఆక్షేపించే పరిస్థితి టీడీపీలో నెలకుంది.
దానికంతటికీ జగదీశ్‌ను మరోసారి ఎంపిక చేయడమే కారణం. ఎన్నికలకు ముందు, తర్వాత టిక్కెట్లు, పదవులు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున సొమ్ము గుంజారని జగదీశ్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి. అటు పార్వతీపురం, కురుపాం, చీపురుపల్లి నియోజకవర్గ నేతలైతే అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతిరాజు దృష్టికి కూడా తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. అధ్యక్ష పదవి రేసులో ఉన్న తూముల భాస్కరరావు సైతం జగదీశ్ వ్యవహారాన్ని అధినేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన జోరుకు బ్రేకులు పడతాయని నేతలు భావించారు.
జగదీశ్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పదవి ఆయనకు చివరికి అధ్యక్ష పదవి సైతం ఊడిపోతుందని పార్టీలో ప్రచారం ఊపందుకుంది. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని అశోక్ గజపతిరాజు ప్రోత్సహించరని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ, తన చేతిలో ఏదోక పదవి ఉండకపోతే రాజకీయంగా ఇబ్బందులొస్తాయన్న భయంతో జగదీశ్ తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. కొందరు వ్యతిరేకుల్ని, ఫిర్యాదు చేసిన నేతల్ని తన దారికి తెచ్చుకున్నారు. ఎన్నిక తేదీ సమీపించే కొద్దీ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకున్నారు. అయితే, అశోక్ గజపతిరాజు ఇవన్నీ చూడరని, ప్రవర్తనా తీరును పరిశీలిస్తారని, ఆరోపణల్ని, ఇంటలిజెన్స్ నివేదికల్ని పరిగణలోకి తీసుకుని తప్పకుండా మార్చుతారని జగదీశ్ వ్యతిరేక వర్గీయులు భావించారు. కానీ వారి అంచనాల్ని తలకిందలు చేసి, ఎవరి అభిప్రాయాన్ని తీసుకోకుండా అందరి ఆమోదం మేరకు జగదీశ్‌ను మరోసారి ఎంపిక చేసినట్టు అశోక్ గజపతిరాజు అంతర్గత సమావేశంలో ప్రకటించి, దాన్నే ఎన్నికల పరిశీలకులు రావెల కిషోర్‌బాబు చేత ప్రకటింపచేయడం జగదీష్ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది.
నేతల అభిప్రాయాల్ని తీసుకుంటే ఒక్కొక్కరూ చెప్పేవారని, జగదీశ్‌ను వ్యతిరేకంగా గళం విప్పేందుకే అశోక్ బంగ్లాకు సుమారు 200మంది నాయకులొచ్చారని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఎవరికీ చెప్పుకునేందుకు అవకాశమివ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు కూడా తప్పుపట్టినట్టు తెలిసింది. పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరించి, అశోక్ తొలిసారి దారి తప్పారని ఆక్షేపిస్తున్నట్టు సమాచారం. అవినీతిని ప్రోత్సహించే విధంగా అశోక్ గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారని పలువురు నాయకులు తప్పు పడుతున్నారు. అంటే పార్టీలో ఏంచేసినా చెల్లుపోతుందని, అవినీతి అక్రమాలకు పాల్పడినా పట్టించుకోరని, అశోక్ సైతం తేలికగా తీసుకుంటారనే సంకేతాల్ని బయటకు పంపించినట్టు అవుతుందని పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నిత్యం అవినీతి వ్యతిరేకంగా మాట్లాడే అశోక్....ఆరోపణలు వచ్చిన వ్యక్తివైపు మొగ్గుచూపడంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అది ఏక...అభిప్రాయం!
Published Tue, May 19 2015 2:51 AM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM
Advertisement