కష్టకాలంలో పార్టీ బాధ్యతలను అప్పగించి, అధికారంలోకి వచ్చినప్పుడు పక్కన పెట్టడం సరికాదనుకుందో
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కష్టకాలంలో పార్టీ బాధ్యతలను అప్పగించి, అధికారంలోకి వచ్చినప్పుడు పక్కన పెట్టడం సరికాదనుకుందో ఏమో తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ముచ్చటగా మూడో సారి కూడా జిల్లా పార్టీ పగ్గాలను ద్వారపురెడ్డి జగదీష్‌కు కట్టబె ట్టింది. పాత కమిటీలో కొనసాగిన ఐవీపీ రాజును మళ్లీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడిన తూముల భాస్కరరావు ప్రయత్నాలను అధిష్టానం పక్కన బెట్టింది. ఆయనను సమర్థించిన నేతలను ఉసూరు మనిపించింది.
‘ఏదో జరిగిపోతోంది...అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడ్ని పార్టీ ఎంపిక చేస్తోంది. నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి. భిన్న వాదనలు వ్యక్తమవుతాయి. అధిష్టానానికి కాసింత తలనొప్పి తప్పదు’ అంటూ వచ్చిన ఊహాగానాలు తుస్సుమన్నాయి. ఏదీ జరక్కుండానే అశోక్ గజపతిరాజు అనుకున్నది అయిపోయింది. పరిశీలకులుగా మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే ఆంజనేయులు వచ్చినా అంతా అశోక్ అభీష్టం మేరకే జరిగింది. అడ్‌హాక్ కమిటీ కన్వీనరుగా జగదీష్ ఉన్నందున మరోసారి జగదీష్‌కే పార్టీ బాధ్యతల్ని అప్పగిద్దామని అశోక్ ప్రతిపాదించగా దానికి అందరూ సరే అన్నారు. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అడ్ హాక్ కమిటీ నియామకం సందర్భంలోనే జరగాలని, అప్పుడులేనిది ఇప్పుడెందుకని జగదీష్‌ను వ్యతిరేకిస్తున్న నేతలకు స్పష్టత ఇచ్చి ఊ కొట్టించారు. ఆ నిర్ణయాన్నే ఎన్నికల పరిశీలకుడు మంత్రి రావెల కిషోర్‌బాబు వేదికపై ప్రకటించారు. దీంతో జగదీష్ అనుకూల వర్గీయుల్లో ఆనందం వెల్లివిరియగా, వ్యతిరేక వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది.
ఫలించిన జగదీష్ ప్రయత్నాలు
గత వారం రోజులుగా ద్వారపురెడ్డి జగదీష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తనను వ్యతిరేకిస్తున్న నేతల్లో పలువురిని దారికి తెచ్చుకోవడంతో ఆయన విజయం సాధించారు. ఫిర్యాదులతో అధిష్టానం వరకు వెళ్లిన నేతలు సైతం జగదీష్‌కు మద్దతుగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరి క్షణంలో అన్ని వైపులా మద్దతు కూడగట్టి, అశోక్ ఆశీస్సులతో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. కాగా, జగదీష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు ఎన్నికల ప్రాంగణమైన అశోక్ బంగ్లాకు సుమారు 200మంది వచ్చారు. అభిప్రాయం చెప్పుకోవడానికి అవకాశమిస్తే వారంతా నిరసన గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, పార్టీ పెద్దలు ఈ విషయాన్ని పసిగట్టారో ఏమో? నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని, బయటికొచ్చి ప్రకటించేశారు. అశోక్ గజపతిరాజే నిర్ణయం తీసుకున్నప్పుడు తామేం చేయగలమని వాపోతూ వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు.
జగదీష్‌కు ఎమ్మెల్సీ చాన్స్ మిస్సేనా?
వాస్తవానికి, ద్వారపురెడ్డి జగదీష్ ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆమేరకు మద్దతును కూడగట్టారు. అధిష్టానాన్ని కూడా ప్రాధేయ పడ్డారు. అయితే, ఆయనపై వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదవి వస్తుందో పోతుందో గానీ ఇప్పుడున్న అధ్యక్ష పదవి పోయేటట్టు ఉందనే ఆలోచనతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడీ చాన్స్ మిస్సయితే రెంటికీ చెడ్డ రేవడి అవుతానేమోనన్న భయంతో అధ్యక్ష పదవి కోసం మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ పగ్గాలు దక్కాయి. దీంతో ఎమ్మెల్సీ పదవి రేసులో జగదీష్ ఉండకపోవచ్చన్న వాదనలు విన్పిస్తున్నాయి. అదే జరిగితే ఎమ్మెల్సీ పదవికైనా తూముల భాస్కరరావును గాని, తెంటు లక్ష్ముంనాయుడ్ని గాని పరిశీలించొచ్చనే చర్చ జరుగుతోంది.