రుణాలన్నీ మాఫీ చేస్తారా.. లేదా?
సీఎం చంద్రబాబుకు సీపీఎం నేత బి.వి. రాఘవులు సూటి ప్రశ్న
పాలకొల్లు: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిస్థారుులో మాఫీ చేస్తారో లేదోనన్న విషయూన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే తేల్చిచెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై చంద్రబాబు చేసిన తాజా ప్రకటన రైతులు, డ్వాక్రా మహిళలను అయోమయంలోకి నెట్టేసిందన్నారు. చంద్రబాబు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. సార్వా సీజన్ ప్రారంభమై పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న రైతులు.. రుణాలు మాఫీ అవుతాయో లేదో, రీ షెడ్యూల్ అరుునా చేస్తారో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కౌలు రైతులకూ రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
రీయింబర్స్‌మెంట్ సంగతేంటి?
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయం ఎటూ తేలకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని సూచించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్రం జోక్యం కోసం ముఖ్యమంత్రి పడిగాపులు పడడం అవివేకమన్నారు. మద్యం వ్యాపారానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి సంబంధాలున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే చంద్రబాబు అధికారం చేపట్టి మద్యం వ్యాపారానికి తెరలేపారని చెప్పారు. బెల్ట్‌షాపులు నిరోధిస్తామని, ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలు వేస్తామని ప్రభుత్వం చెప్పడం దళారులను పెంచిపోషించడానికేనని విమర్శించారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరిందని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు