మార్కెట్ విలువపై సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వం నుండి భూములు పొంది వాటిని సద్వినియోగం చేసుకోకపోతే అటువంటి భూములను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు...
వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా సీసీఎల్‌ఏ ఆదేశం
కర్నూలు అగ్రికల్చర్ : మార్కెట్ విలువపై సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వం నుండి భూములు పొంది వాటిని సద్వినియోగం చేసుకోకపోతే అటువంటి భూములను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్(సీసీఎల్‌ఏ) అనిల్ చంద్ర పునీత ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ మాట్లాడుతూ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతామంటూ సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వం నుండి మార్కెట్ విలువ ప్రకారం భూములు తీసుకున్నారని, దేనికైతే భూములు తీసుకున్నారో దానికే వినియోగించాలని, మరొక దానికి వినియోగించారా లేదా ఖాళీగా ఉంచారా.. అనేది పరిశీలించాలని తెలిపారు.
సద్వినియోగం చేయని భూములను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. ఇటువంటి భూములపై విచారణ జరిపి వివరాలను పంపాలన్నారు. అటవీ భూములకు కూడా సర్వే నంబర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్లాక్‌ల వారీగా అటవీ భూములను రెవెన్యూ, ఫారెస్ట్ సిబ్బంది ఉమ్మడిగా తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. రుణ అర్హత కార్డుల జారీకి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎంత మంది కౌలుదారులు ఉన్నారు, ఎంత మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చాము. ఇంకా ఎంత మంది వీటిని కోరుతున్నారనే దానిపై ప్రతిపాదనలు ఇవ్వాలని పేర్కొన్నారు. కర్నూలు నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్, ఆర్‌డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి పి.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.