వైద్యం.. మృగ్యం
Published Mon, Oct 21 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
సాక్షి, సంగారెడ్డి:జబ్బు చేయకూడదు. అనుకోని ఆపద రాకూడదు. వస్తేగిస్తే ఆదివారం మాత్రం రాకూడదు. రాత్రివేళ అస్సలు రాకూడదు. సెలవు రోజుల్లో జబ్బు చేస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. వైద్యుల గైర్హాజరీ రోగుల ప్రాణాలను తోడేస్తోంది. శనివారం నుంచే వైద్య నారాయణలు పత్తా లేకుండాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, విష పురుగుల కాటుకు గురైన బాధితులు, ప్రసవ వేదనతో బాధపడే గర్భిణులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలందడం లేదు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరని రోగులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక్కడ సైతం నాడి పట్టి పరీక్షించకుండానే ‘గాంధీకి పోండి..’ అని రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడికి చేరుకునేలోపే రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఉన్న వైద్యులు సర్కారీ వైద్యం కంటే సొంత క్లినిక్‌లపైనే మక్కువ చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
క్లస్టర్లు.. కష్టాలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 10 క్లస్టర్ హెల్త్ అండ్ న్యూట్రీషియన్ సెంటర్లున్నాయి. ఒక్కో క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, సబ్ సెంటర్ల పనితీరును నిరంతరం సమీక్షించడం, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలందే విధంగా పర్యవేక్షణ జరపడం క్లస్టర్ వైద్యాధికారుల బాధ్యత. జిల్లాలో 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ)న్నాయి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పీహెచ్‌సీలు పనిచేయాల్సి ఉండగా.. ఎక్కడా నిర్దేశించిన వేళల్లో వైద్య సేవలందడం లేదు.
ఇద్దరు వైద్యాధికారులున్న పీహెచ్‌సీల్లో సైతం సెలవు రోజుల్లో కనీసం ఒక్కరైనా విధులకు హాజరు కావడంలేదు. సాధారణ రోజుల్లో ఒంటి పూట డ్యూటీలకే పరిమితమవుతున్నారు. వైద్యుల గైర్హాజరీతో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండర్లు, స్వీపర్లు వచ్చి రాని వైద్యంతో నెట్టుకొస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల పనితీరు సైతం గాడిలో పడడం లేదు. టీకాలు వేయడం, స్థానికుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవడంలో వీరి పాత్ర కీలకం. కానీ, జిల్లాలో 525 ఉప కేంద్రాలున్నా వైద్య సేవలందక మాతా శిశు మరణాల రేటు తగ్గడం లేదు. ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాల్సిన స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులే గైర్హాజరు అవుతుండడంతో దిగువ స్థాయిలో ఇష్టారాజ్యం నెలకొంది.
సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 ఏరియా ఆస్పత్రులు రోగులను రిఫర్ చేస్తూ వదిలించుకోడానికే పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో సైతం 24 గంటల సేవలు మృగ్యమయ్యాయి. ఆస్పత్రి సేవల జిల్లా కో-ఆర్డినేటర్(డీసీహెచ్‌ఎస్) వీణాకుమారి ఫోన్‌లో సైతం అందుబాటులో ఉండరని విమర్శలున్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రెండేళ్లు వైద్య సేవలందిస్తేనే పీజీ వైద్య విద్యకు అర్హత లభిస్తుంది. పీజీ అర్హత కోసమే ప్రభుత్వ సర్వీసుల్లో చేరి విధులకు గైర్హాజరవుతున్న వైద్యాధికారులు కోకొల్లలుగా ఉన్నారు.
Advertisement
Advertisement