తీరు మారకపోతే సస్పెన్షనే : మంత్రి శిద్దా ఆగ్రహం
ఈ సారి చూసేది ఉండదు, సస్పెన్షనే అని రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్యపై మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్‌లో మెడికోల బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన ఘటనపై స్పందించిన మంత్రి రిమ్స్‌ను సందర్శించి నిప్పులు చెరిగారు. చేతకాకపోతే సెలవు పై వెళ్లిపోవాలని, పనిచేసే అధికారులు రిమ్స్‌కు వస్తారని హెచ్చరించారు.
ఒంగోలు సెంట్రల్ : ‘రిమ్స్ పరిస్థితిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశా.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినప్పుడు చూశా. ఈసారి చూసేది ఉండదు.. సస్పెన్షనే అని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్యపై రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మెడికోలను విచారించేందుకు మంత్రి ఆదివారం మధ్యాహ్నం రిమ్స్‌లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నాలుగు రోజులుగా వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, మంచినీటి వసతి లేదని, శానిటేషన్‌కు తామే డబ్బులు చెల్లిస్తున్నామని..తాగుబోతులు వసతి గృహ పరిసరాల్లో సంచరిస్తున్నారని, రోడ్ల మీద లైట్లు లేక భయంతో ఉంటున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు.
మొత్తం 260 మంది బాలికలు వసతి గృహంలో ఉంటున్నామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. రిమ్స్ డెరైక్టర్‌ను మందలించారు. ఏదో ఒక హెడ్ నుంచి నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరించాలన్నారు. బాలికల వసతి గృహానికి విద్యుత్ అంతరాయంపై మంత్రి ప్రశ్నించడంతో విద్యుత్ శాఖ డీఈ రామ్మూర్తి సమాధానమిస్తూ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని..అండర్ గ్రౌండ్ కేబుల్‌ను తెప్పిస్తున్నామని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరించడం కూడా చేతకాకపోతే ఎందుకు, సెలవుపై వెళ్లాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా లైన్ వేసి విద్యుత్‌ను పునరుద్ధరించాలని సూచించారు.
అనంతరం రిమ్స్ ప్రాంగణంలోని ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో మంచినీరు రావడం లేదని విద్యార్థినులు తెలపగా..దానికి స్పందించిన నిర్మాణ శాఖ డీఈ జగన్నాథరావు మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్‌లో చిన్నచిన్న విడిభాగాలు విజయవాడ నుంచి త్వరలోనే తెప్పిస్తామన్నారు. దీనికి ఆగ్రహించిన మంత్రి విజయవాడ నుంచి తెప్పించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ..ఉన్న అధికారులంతా సెలవుపై వెళ్లిపోవాలని..పనిచేసే అధికారులు రిమ్స్‌కు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు తీసుకుంటూ పనిచేయకపోతే ఎట్లా..చేతకాకపోతే తప్పుకోండి అన్నారు.
రిమ్స్‌లో శానిటేషన్, మంచినీటి వసతి లేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా వైద్యం చేయడం లేదని, మందులు ఉండవని తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. శనివారం యాక్సిడెంట్ కేసులో రిమ్స్‌కు వచ్చిన క్షతగాత్రులకు రాజశేఖర్ అనే వైద్యుడు చికిత్స చేయకుండా ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరు మృతి చెందారని..దీనికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించారు. రిమ్స్‌లో భవన నిర్మాణాలను డిసెంబర్ 3వ తేదీకల్లా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ విషయంపై హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లేట్‌లెట్ మిషన్ జిల్లాకు తెప్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ మాట్లాడుతూ రిమ్స్‌కు రోజూ మూడున్నర లక్షల లీటర్ల నీరు అవసరమని..కార్పొరేషన్‌వారు ఆమేరకు సరఫరా చేయడంలేదని తెలిపారు. కొంత మేరకు పాత రిమ్స్ నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని తెప్పిస్తున్నామన్నారు. మంత్రి వెంట ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ, ఒన్‌టౌన్ సీఐ, ఎస్సై, వైద్యులు ఉన్నారు.