
‘మోదీని, జగన్ ను తిట్టి స్థాయి తగ్గించుకోవద్దు’
ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్‌ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్‌ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. వైఎస్ జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఆరోపించారని.. ఆధారాలు చూపించమని అసెంబ్లీలో అడిగితే లేవన్నారని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు స్థాయి మరిచి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీని, జగన్‌ను తిట్టి టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు.
తాము కేసుల గురించి మాట్లాడుకున్నామని మంత్రి అచ‍్చెన్నాయుడుకు ప్రధాని మోదీ చెప్పారా అని కడిగి పారేశారు. వైఎస్ జగన్ ప్రధానమంత్రిని కలిస్తే తప్పేముందన్నారు. వైఎస్ జగన్ ఏమైనా ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. జగన్, ప్రధానిని కలిస్తే టీడీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. టీడీపీకి, వైఎస్‌ఆర్ సీపీకి 5లక్షల ఓట్లు వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా మద్దతు తెలపడంలో తప్పేముందన్నారు. టీడీపీ నేతలను అడిగి అపాయింట్ మెంట్ ఇచ్చుకునే దౌర్భగ్య స్థితిలో ప్రధాని లేరని స్పష్టం చేశారు.