ప్రభుత్వ తీరు వల్లే శాంతిభద్రతలకు విఘాతం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
పాల్మన్‌పేట బాధితుల పరామర్శ
{పజా సమస్యలపై పార్టీ తరఫున పోరాటం
పాయకరావుపేట: టీడీపీ ప్రభుత్వం తీరువల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. పాల్మన్‌పేటలో జరిగిన దాడుల్లో గాయపడిన బాధితులను శుక్రవారం ఆయనతోపాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితరులు పరామర్శించారు. ఎంపీటీసీ, సర్పంచ్ కుటుంబ సభ్యులు, గాయాలతో మంచాలపాలయిన వారిని సముదాయించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ గ్రామంలో దాడులపై పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ పూర్తి వివరాలు సేకరించిందన్నారు. కాపు ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న వివాదాలను వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. పాల్మన్‌పేట ఘటనకు టీడీపీ నాయకులు కారణం కాదా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా మాట్లాడుతూ పాల్మన్‌పేట ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన గూండాల సెల్ నంబర్లు సేకరించి, దాడుల వెనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాల్మన్‌పేటలో జరిగిన దాడుల్లో గాయపడిన బాధిత కుటుం బాలను ఈనెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తారని అమర్‌నాథ్ చెప్పారు.
ఆయన పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి గ్రామంలో పర్యటిస్తారని వివరించారు. పార్టీశ్రేణులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, మండల యూత్ అధ్యక్షుడు నీలాపు చిరంజీవిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఆడారి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి దేవరవపు వెంకటేశ్వరరావు, బీవీ రమణ, కొంకిపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.