దమ్ముంటే రాజీనామాలు చేయించి గెలిపించుకోండి
టీడీపీకి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్ సవాల్
కొందరు ఎమ్మెల్యేలు వెళ్లినా పార్టీకి నష్టం లేదు
చంద్రబాబుది ద్వంద్వ నీతి
నక్కపల్లి: చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి టీడీపీ తరఫున గెలిపించుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ సవాల్ చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి గెలుపొందిన తర్వాత పదవులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారని, ఇప్పుడు ఏపీలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వారిచేత ఎందుకు రాజీనామాలు చేయించలేదని ప్రశ్నించారు. ఆయన బుధవారం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. గురివింద గింజ తన నలుపెరగదన్నట్లు.. చంద్రబాబుకు ఎదుటివారి తప్పులు ఎత్తి చూపడమే తప్ప తన తప్పులు కనిపించవని ఎద్దేవా చేశారు. ఆయనది ఎప్పుడూ రెండునాల్కల ధోరణే అని, అవసరాన్ని బట్టి మాటమార్చడం ఆయనకు అలవాటేనని చెప్పారు.
చంద్రబాబును అభద్రతాభావం పీడిస్తోందని, ప్రభుత్వానికి తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటకీ ఎక్కడ తమ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే భయంతో ముందుగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మాభిమానం చంపుకున్నవారే పార్టీని వీడి వెళ్తారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందని, ప్రజలు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలకు ప్రజలు మోసపోయి బాబు పాలనలో విసిగిపోయారన్నారు.
వైఎస్సార్ సీపీ ఆవిర్భావమే ఒక్క ఎమ్మెల్యేతో జరిగిందని, విజయమ్మ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తుచేశారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని స్పష్టంచేశారు. పార్టీ నుంచి ఎంతమంది వీడినా వైఎస్సార్‌సీపీకి కాని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గాని వచ్చే నష్టం ఏమీలేదన్నారు. ప్రజలంతా తమ పక్షానే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.