నమ్మించి గొంతుకోశారు..
- డ్వాక్రాకు రుణమాఫీ లేదన్న బ్యాంకు అధికారి
- మండిపడ్డ మహిళలు
- కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నా
చంద్రబాబు నమ్మించి డ్వాక్రా మహిళల గొంతు కోశాడంటూ డ్వాక్రా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ వర్తించదని ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజరు రవికుమార్ స్పష్టం చేయడంతో వారంతా అవాక్కయ్యారు. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటే పొలం పనులు మానుకుని బ్యాంకు వద్దకు వచ్చి మండుటెండలో ఎదురు చూస్తే చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలన్నీ రద్దుచేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు.
గుడ్లవల్లేరు : ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే బ్యాంకు ప్రాంగణంలో రుణమాఫీపై బుధవారం విజయవాడ జోనల్ చీఫ్ మేనేజర్ పి.వి.రవికుమార్ రైతులు, డ్వాక్రా మహిళలకు స్థానిక బ్రాంచి మేనేజరు కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సులో రవికుమార్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వర్తించదని, ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ కింద కేటాయిస్తామని చెప్పారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ విషయమై ప్రభుత్వం మరిన్ని విధివిధానాల్ని త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
పంట రుణమాఫీకి షరతులు వర్తిస్తాయ్...
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను జీవో నంబరు 174 ప్రకారం నిర్వర్తించనున్నట్లు రవికుమార్ తెలియజేశారు. రైతులు బ్యాంకులో 2013 డిసెంబరు 31వ తేదీ నాటికి తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలతో పాటు గతంలో దీర్ఘకాలిక రుణాలుగా మార్చిన పంట రుణాలు, వ్యవసాయ నిమిత్తం బంగారంపై తీసుకున్న పంట రుణాల మొత్తానికి మాఫీ వర్తిస్తుందన్నారు. ఈ రుణాలు 2014 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించవలసిన మొత్తానికి నిబంధనల మేరకు మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షల పరిమితి వరకూ మాత్రమే రుణమాఫీ వర్తించనున్నట్లు పేర్కొన్నారు. 2014 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించవలసిన రుణాల్ని రైతులు ఆ తేదీ తర్వాత చెల్లించిన వాటికి కూడా నిబంధనల మేరకు మాఫీ వర్తిస్తుందన్నారు.
చంద్రబాబు మోసం చేశాడంటూ మహిళల ఆరోపణ...
చంద్రబాబు నమ్మించి డ్వాక్రా మహిళల గొంతు కోశాడంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒక్కో గ్రూపునకు రూ.లక్ష రుణమాఫీ చేస్తారని పొలం పనులు మానుకుని బ్యాంకు వద్దకు వచాచమని అయితే అధికారులు చెప్పిన మాటలను బట్టి తమను చంద్రబాబు మోసం చేశారని అర్థమైందని వాపోయారు. తమ పద్ధతిలో తాము పొదుపు చేసుకుంటూ రుణాల్ని సవ్యంగా చెల్లిస్తున్న సమయంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ వలన రుణాల చెల్లింపే గాక పొదుపు చేయడం మానేశామన్నారు. ఓట్లు వేయించుకున్న బాబు తమకు బాగానే బుద్ధి చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. గ్రామ సర్పంచులు పామర్తి హనుమంతరావు, పడమటి సుజాత, భూషణం, రైతులు జగన్మోహనరావు, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
రుణమాఫీ అంటూ రైతులకు నోటీసులా?
రుణమాఫీ చేస్తామన్న బాబు బ్యాంకర్లతో రైతులకు నోటీసులు ఇప్పించడం అన్యాయమని రైతులు బాడిగ భాస్కరరావు, చిన పాములు అన్నారు. రుణమాఫీ చేయాలంటే ఒక్క మహానేత వైఎస్‌కే సాధ్యమైందన్నారు. అర్ధం లేని నిబంధనల పేరిట రుణమాఫీలోనూ బాబు రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.
కౌలుదారులకు రుణమాఫీ వర్తించదా?
రుణమాఫీ కౌలుదారులకు ఎందుకు వర్తింపజేయరని వెణుతురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రభాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంటి కౌలుదారులే ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. అలాంటి వారికి రుణమాఫీ లేకుండా సాగు చేయనివారికి రుణమాఫీ చేయటం అన్యాయమని తెలిపారు.