లక్ష్యాలు.. ఆదేశాలు | Earlier than Different Stretch CM Two Day tour | Sakshi
Sakshi News home page

లక్ష్యాలు.. ఆదేశాలు

Published Sat, May 16 2015 4:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

Earlier than Different Stretch CM Two Day tour

- మునపటి కంటే భిన్నంగా సాగిన సీఎం రెండు రోజుల పర్యటన
- పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి
- పోలవరం ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేస్తామని పునరుద్ఘాటన
- కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులకు, అధికారులకు హెచ్చరికలు
- కొత్త వరాలు లేకున్నా.. గత హామీలు
- అమలు చేస్తానన్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు
: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏడాది కాలంలో ఇప్పటివరకు చేసిన సుడిగాలి పర్యటనలకు.. గురు, శుక్రవారాల్లో పోలవరం, పట్టిసీమ గ్రామాల్లో చేసిన పర్యటనకు ఎంతో తేడా ఉంది. జిల్లాకు ఎప్పుడు వచ్చినా నాయకులు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించే సీఎం ఈసారి అందుకు భిన్నంగా గతంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని మాటిచ్చారు. మునుపెన్నడూ లేనివిధంగా జిల్లా అధికారులకు, పోలవరం, పట్టిసీమ కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులకు భారీగా క్లాస్ పీకారు. లక్ష్యాలు నిర్ధేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలవరం కొండపైకి చేరుకున్న చంద్రబాబు అనంతరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఏకబిగిన ఐదు గంటలకు పైగా అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులతో దపదఫాలుగా మాట్లాడారు.

ఆగస్టు నాటికి ‘పట్టిసీమ’
వచ్చే ఆగస్టు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాంట్రాక్ట్ సంస్థతో పనులు చేయించే బాధ్యత అధికారులదేనన్నారు. పోలవ రం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్యాకేజీ-1 పనులను 30 రోజుల్లో, రె ండో ప్యాకేజీ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మూడో ప్యాకేజీ పనులు 30 రోజుల్లో, నాలుగో ప్యాకేజీలో భూసేకరణ పూర్తిచేసి జూలై నెలాఖరు నాటికి అప్పగించాలని ఆదేశించారు. ఐదో ప్యాకేజీలో 70 వరకు స్ట్రక్చర్ల నిర్మాణం పెడింగ్‌లో ఉన్నందున ప్రత్యామ్నాయంగా 60 సీ ప్రకారం 45 రోజుల్లోను పనులు పూర్తి చేయాలన్నారు. ఆరో ప్యాకేజిలో పెండింగ్ బిల్లులు పెండింగ్ 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏడో ప్యాకేజిలోఅవసరమైతే టెండర్లు రద్దు చేసి షార్ట్ టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయించాలన్నారు. పోలవరం కుడి కాలువకు భూములివ్వని రైతులకు రూ.30 లక్షల వరకు పరిహారం ఇవ్వండని కలెక్టర్‌కు సూచించారు.

పుష్కరాలకు కేంద్రం ఇచ్చింది రూ.100 కోట్లే
గోదావరి పుష్కరాలకు రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. శుక్రవారం ఉద యం ఆయన పోలవరంలో మీడియా తో మాట్లాడారు. పుష్కరాలకు కేంద్రం కేవలం రూ.100 కోట్లే ఇచ్చిందన్నారు.

ప్రతి ఎకరాకు నీళ్లిస్తా
జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు ప్రయత్నిస్తున్నామని, రెండునెలల్లో తాడిపూడి పథకం పనులు పూర్తి చేయిస్తామని సీఎం చెప్పారు. జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనుల్లో వేటిని ముందుగా చేపట్టాలన్న అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించి 30 రోజుల్లో పూర్తయ్యే పనులను ముందుగా చేయిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఆధునికీకరణ కు రూ.1,300 కోట్ల నుంచి రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. పనులను సాగునీటి, రైతు సంఘాలకు నామినేషన్ పద్ధతిపై అప్పగించి పూర్తి చేయిస్తామన్నారు.

భీమవరంలో మెరైన్ యూనివర్సిటీ
మెరైన్ యూనివర్సిటీని భీమవరం సమీపంలో త్వరలోనే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు దాత  ముందుకు వచ్చారన్నారు. నరసాపురంలో పోర్టు ఏర్పాటుకు నాలుగైదు వేల ఎకరాలు అవసరమవుతాయన్నారు. ఫుడ్ పార్కు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే నిట్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. కలెక్టర్ కె.భాస్కర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించడానికి ఎంతో కష్టపడుతున్నారని సీఎం అభినందించారు.

పోలీసుల తీరు బాగోలేదా
‘ప్రశాంతతకు మారుపైనేన పశ్చిమగోదావరిలో నేరాలు పెరిగిపోతున్నాయా. ఎందుకిలా జరుగుతోందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రశాంత జిల్లా అని సీఎం పదే పదే ప్రస్తావిస్తుండగా.. ఓ మీడియా ప్రతినిధి ‘ఎక్కడ ప్రశాంతత సార్. నేరాలు, లాకప్ డెత్‌లు, అనుమానాస్పద మృతులు, చోరీలతో జిల్లా అట్టుడికిపోతోంది’ అని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు మారుతున్నారా.. పోలీసింగ్ బాగోలేదా’ అని  ప్రశ్నించారు. ఈ విషయమై సీరియస్‌గా దృష్టి పెట్టండని పక్కనే ఉన్న మంత్రి పీజల సుజాత, ఎంపీ మాగంటిబాబుకు సూచించారు.

Advertisement
Advertisement