కొనసాగుతున్న ‘ఈనాడు’ అసత్య ప్రచారం | eenadu Goebbels campaign continues on sakshi | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ‘ఈనాడు’ అసత్య ప్రచారం

Published Thu, Dec 18 2014 3:12 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

కొనసాగుతున్న ‘ఈనాడు’ అసత్య ప్రచారం - Sakshi

కొనసాగుతున్న ‘ఈనాడు’ అసత్య ప్రచారం

* ఈడీ అటాచ్‌మెంట్ల క్రమంలో... ఇది పెన్నా చార్జిషీటు!
* వరుసగా అటాచ్‌మెంట్లు చేస్తూ వస్తున్న ఈడీ
* తాజాగా పెన్నా చార్జిషీటు విషయంలోనూ అదే చర్య
* పనిగట్టుకుని ఆందోళన కలిగించేలా ‘ఈనాడు‘ వార్తలు

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: తెలిసిన వాళ్లకయితే ‘ఇది మరో చార్జిషీటు’ అంతే!. అదే తెలియని వాళ్లకయితే... ‘సాక్షి పత్రిక, టీవీ ఆస్తుల జప్తు’ అనేది ఆందోళన కలిగించే అంశం. కాబట్టే ‘ఈనాడు’ పత్రిక మరికాస్త మసాలా దట్టించి మొదటి పేజీలో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఫొటోతో సహా అంతపెద్ద వార్తను అచ్చేసింది. తన లక్ష్యం సాక్షి, వైఎస్ అభిమానుల్లో ఆందోళనను పెంచటమేనని మరోసారి చాటుకుంది. నిజానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో మొదటినుంచీ జరుగుతున్న పరిణామాల్ని చూసినవారెవరూ దేనికీ ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఈ కేసులో జరిగినవన్నీ ఆశ్చర్యం కలిగించేవి, ఇంతకు ముందెన్నడూ ఏ కేసులోనూ జరగనివే కాబట్టి.

తాజా వ్యవహారం విషయానికొస్తే ఇదే కేసులో సాక్షి పత్రిక, చానల్‌కు సంబంధించిన రూ.47 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. నిజానికి ఈ కేసులో ఆస్తుల్ని ఈడీ అటాచ్‌మెంట్ చేయటమనేది ఇది తొలిసారేమీ కాదు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఈడీ స్వయంగా దర్యాప్తు చేయకుండా సీబీఐ వేసిన ప్రతి చార్జిషీట్‌నూ యథాతథంగా స్వీకరిస్తూ సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న ఆస్తుల వివరాల ప్రకారం అటాచ్‌మెంట్ చేస్తున్నట్టు ప్రకటిస్తోంది.  

ఇప్పటికి సీబీఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి 11 చార్జిషీట్లు వేయటం తెలిసిందే. వాటిలో అరబిందో, హెటెరో డ్రగ్స్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, కొందరు వ్యక్తులు వ్యక్తిగత స్థాయిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, రాంకీ గ్రూపు పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును అనుసరిస్తూ... ఆయా చార్జిషీట్లలో పెట్టుబడులుగా పేర్కొన్న మొత్తాలకు సంబంధించి బ్యాంకు డిపాజిట్ల నుంచి భవనాల వరకు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన పలు ఆస్తుల్ని ఈడీ యథాతథంగా అటాచ్ చేస్తూ వస్తోంది. ఈ అటాచ్‌మెంట్లను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి కూడా.

ఇదే క్రమంలో పెన్నా గ్రూపు సంస్థలు సాక్షిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఛార్జిషీటు మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా సోమవారం రాత్రి ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీన్లో ఆయా ఆస్తుల్ని వరసగా పేర్కొంటూ.... సాక్షి భవనాల జాబితాను ఇచ్చేసరికి... ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిన తీరులో సాక్షి , వైఎస్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించేలా ‘ఈనాడు’ మొదటిపేజీలో పేద్ద వార్తను అచ్చేసింది.

‘ఈనాడు’ గమనించాల్సిన విషయమేంటంటే ‘సాక్షి’ ఆస్తుల్ని ఎలియనేట్ చేయరాదంటూ రెండేళ్ల కిందట రాష్ట్ర హైకోర్టే ఓ కేసులో ఉత్తర్వులిచ్చింది.  అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల్లో క్రయవిక్రయాలు  కుదరవు. వాటాలు విక్రయించటం వంటివి చేయకూడదు. అంతకు మినహాయించి రోజువారీ కార్యక్రమాలకు ఏమాత్రం అంతరాయం కలగరాదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రతి లావాదేవీనీ ఎంతో పారదర్శకంగా నిర్వహించే సాక్షి... అప్పటి  నుంచీ అటాచ్‌మెంట్ పరిధిలోనే తన కార్యకలాపాలను కొనసాగిస్తూ... దినదిన ప్రవర్ధమానమవుతుండటం ‘ఈనాడు’కు మింగుడుపడటం లేదు. అదే ఈ రాతలకు అసలు కారణం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement