
ఎంసెట్ అక్రమాలకు చెక్
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఎంసెట్‌లో హైటెక్ మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
హైటెక్ మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు
తరచూ పరీక్ష రాస్తున్నవారిపై పక్కా నిఘా
ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసినవారిపై కూడా..
వారి సెల్‌ఫోన్ల ట్యాపింగ్.. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ
ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయాలు
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఎంసెట్‌లో హైటెక్ మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా 20 ఏళ్ల వయస్సు పైబడినవారు, 2012కు ముందు ఎంసెట్ రాసినవారు, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసినవారు, కాలేజీల్లో చేరినా మళ్లీ వుళ్లీ ఎంసెట్ రాస్తున్న వారందరిపై పక్కా నిఘా పెట్టనున్నారు. గత మూడు నాలుగు నెలల్లో వారు ఎవరెవరితో మాట్లాడారు.. ఏయే నంబర్లకు ఫోన్ చేశారు.. ఏయే నంబర్ల నుంచి వారికి ఫోన్లు వచ్చాయనే వివరాలన్నింటినీ కూడా సేకరించనున్నారు. పోలీసుల సహకారంతో వారి ఫోన్లను ట్యాప్ చేయడంతోపాటు వారి ఇంటికి వెళ్లి తరుచుగా ఎంసెట్ ఎందుకు రాస్తున్నారు, వారి నేపథ్యం ఏమిటి అనే తదితర వివరాలను తెలుసుకోనున్నారు. ఈనెల 22న ఎంసెట్ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షలో అక్రమాల నిరోధానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవీ నిర్ణయాలు...
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గడియారాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఫీజు కట్టిన 1,375 మంది, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఫీజు కట్టిన 402 మంది, రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసిన 17 మందిపై నిఘా ఉంటుంది.
1994కు ముందు పుట్టి 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు లో పరీక్ష రాస్తున్న 10 వేల మందిపైనా నిఘా పెడతారు.
2013లో ఎంసెట్ రాసి, మళ్లీ ఇపుడు రాస్తున్నవారు 30,110 మంది ఉన్నారు. 2012లో రాసినవారు 7,296 మంది, 2011లో రాసినవారు 2,128 మంది, 2010లో రాసినవారు 667 మంది ఇప్పుడు పరీక్ష రాయడానికి దరఖాస్తు చేశారు.2012, అంతకుముందు ఎంసెట్ రాసి, కాలేజీల్లో చేరి, మళ్లీ ఎంసెట్ రాస్తున్నవారిపై నిఘా ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లు అమర్చుతారు.
2013 ఎంసెట్‌లో 5 వేలలోపు ర్యాంకు వచ్చినా మళ్లీ దరఖాస్తు చేసినవారు 933 మంది ఉన్నారు. గతంలో ఒకసారి ఎంసెట్ రాసినవారు 771 మంది, రెండుసార్లు రాసినవారు 57 మంది, మూడుసార్లు రాసినవారు 17 మంది, నాలుగు సార్లు రాసిన వారు ముగ్గురు ఇపుడు మళ్లీ దరఖాస్తు చేశారు.
పాత వారు మెడికల్‌లోనే సగం!
గతంలో ఎంసెట్ రాసి మళ్లీ దరఖాస్తు చేసినవారిని పరిశీలిస్తే.. వారిలో వయస్సు పైబడిన వ్యక్తుల్లో సగానికంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కే దరఖాస్తు చేశారు. ఇందులో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సు వారు ఎక్కువగా ఉన్నారు.