కూన వైఖరికి వ్యతిరేకంగా మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
నీకెంత ఒల్లు బలిసిందిరా నా కొడకా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు.. నీ బతుకెంతరా నా కొడకా.. నిన్న ఓ ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీకి ఫోన్‌లో కూన రవికుమార్ చేసిన బెదిరింపులివి.
ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను.. నన్ను ఎవరూ ఆపలేరు.. చెట్టుకు కట్టి కాల్చేస్తాను.. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా.. ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీలకు కూన రవికుమార్ చేసిన హెచ్చరికలివి.
చెప్పినట్టు వినకపోతే కుర్చీ లో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా.. పంచాయతీ కార్యదర్శులను భయపెడుతూ కూన అన్న మాటలివి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కూన రవికుమార్ దౌర్జన్యాలు ఆగడం లేదు. నేరుగా అధికారుల వద్దకు వెళ్లి, వారికి ఫోన్ చేసి కాల్చి చంపుతానంటూ.. గోతిలో పాతేస్తానంటూ.. బెదిరిస్తుండడంతో ఉద్యోగులు భయపడుతున్నారు. ఇలాగైతే పనిచేయలేమని వారంటున్నారు. ఇప్పటికే ఒక కేసులో బెయిల్‌పై ఉన్న రవికుమార్ మళ్లీ అదే రకంగా బెదిరింపులు, రౌడీయిజానికి పాల్పడుతుండటం చూస్తే ఆయన వల్ల ఏం హాని జరుగుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమకు కూన రవికుమార్ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, ఇప్పటికే ఉన్న బె యిల్‌ను రద్దు చేయాలని, జైలు నుంచి బయ టకు రాకుండా చూడాలని ప్రభుత్వ ఉద్యో గు లు డిమాండ్ చేస్తున్నారు. కూన వ్యవహార శైలికి వ్యతిరేకంగా సోమవారం జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలియజేశారు. నల్ల రిబ్బన్లతో విధులకు హాజరయ్యారు. ఉద్యోగులు కలెక్టర్ జె.నివాస్‌ని కలిసి కూన రవికుమార్‌తో ఉన్న ప్రాణ భయాన్ని తెలియజేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కూన రవికుమార్ వ్యవహారం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఆయనొక రాజకీయ నాయకుడా? రౌడీయా? అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. బాధ్యత గల నాయకుడెవరైనా ఇలా బెదిరింపులకు దిగరని, రౌడీయిజం చేద్దామనుకునేవారే చంపుతాను, పాతేస్తానంటూ బెదిరిస్తారని పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అరాచకాలు సృష్టించారని, ఇసుకనైతే దోచేశారని, తప్పని పరిస్థితుల్లో రవి ఆగడాలు భరించామని, ఓడిపోయాక కూడా అదే దౌర్జన్యం చేస్తుండడం దారుణమని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ఒకసారి బెయిల్‌పై వచ్చిన వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని, కానీ కూన రవికుమార్ అందుకు భిన్నంగా మరింత రెచ్చిపోయి బెదిరింపులకు దిగుతున్నారని, ఈ సారైనా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
నోరు అదుపులో పెట్టుకోవాలి
ప్రభుత్వ ఉద్యోగులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోకుండా కూన రవి నోరు అదుపులో పెట్టుకోవాలి. కొద్దినెలల కిందటే ఓ ఎంపీడీఓపై కూడా ఇలాగే బెదిరింపులకు దిగడంతో కూన రవిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే ధోరణితో ప్రవర్తించ డం దారుణం. మాజీ విప్ రవి లాగానే అప్ప ట్లో వ్యవహరించిన బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలను ప్రజలు ఛీత్కరించారు. అయినప్పటికీ వీళ్లకి బుద్ధి రాలేదు. ఈ ఘటనలో కూనపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– కిల్లారి నారాయణరావు, పీఆర్ ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షుడు
ఇది క్షమించరాని నేరం
విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం తగదు. ఇలా ఎవరు ప్రవర్తించినా క్షమించరాని నేరంగా పరిగణించాలి. మా జీ విప్ కూన రవికుమార్ గతంలో కూడా అధికారులపై దురుసుగా వ్యవహరించా రు. ఇప్పుడు కూడా అలాగే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇది దారుణం. దీన్ని తోటి ఉద్యోగిగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
– కేసీహెచ్ మహంతి, డిప్లమా ఇంజినీర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు
హేయమైన చర్య
ప్రభుత్వ ఉద్యోగులపై భౌతికంగా, మానసికంగా దాడులకు దిగడం మంచి సంస్కృతి కాదు. ఈఓపీఆర్డీపై కూన రవి వ్యవహరించిన తీరు హేయమైన చర్య. గతంలో ఇలాంటి ప్రవర్తన వల్లనే ఇబ్బందులు తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఉద్యోగులను బెదిరించడం.. పత్రికలు రాయలేని భాషలో దూషించడం దారుణం. దీన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి.
– పి.జయమ్మ, జెడ్పీ యూనిట్ ఉద్యోగుల అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment