చీరాల : బాబు పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగర్ జలాలపై ఆధారపడిన ఆయకట్టుదారులకు నీరు అందక..రుణమాఫీ మాట నమ్మి అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక రైతన్నలు వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతున్నారు. శనగల కొనుగోలు చేస్తామని ఇచ్చిన బాబు తరువాత ఆ ఊసే ఎత్తకపోవడంతో ఇరకాటంలో పడ్డారు. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా జిల్లాలోని రైతుల దుస్థితి ఏర్పడింది.
అప్పులతో సతమతం...
అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత అప్పులతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో వర్షాలు పడడంతో రైతులంతా జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. రుణమాఫీ కాలేదు ... కనీసం రీషెడ్యూలు కూడా అమలు కాలేదు. బ్యాంకర్లు అన్నదాతలకు ఒక్క రూపాయి కూడా అప్పు ఇచ్చేదిలేదని మొండికేశారు. పెట్టుబడులు అత్యవసరం కావడంతో నూటికి రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీకి తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడిగా పెడుతున్నారు. బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు తీసుకుందామన్నా వీలుకాని పరిస్థితులు బాబు కల్పించిందని వాపోతున్నారు.
ఎరువు బరువైంది...
ఎరువు రైతులకు మోయలేని భారంగా మారింది. ఇప్పటికే కౌలు రేట్లు పెరిగాయి. కూలీ రేట్లు రెట్టింపయ్యాయి. విత్తనాల ధరలు గతంలోకంటే అధికమయ్యాయి. ఎరువులు, పురుగు మందులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. రూ.284లకు అమ్మాల్సిన యూరియా రూ.400కు అమ్ముతున్నారు. అది కూడా కాంప్లెక్స్ ఎరువులు కొంటే విత్తనాలు ఇస్తున్నారు. మరికొందరు పురుగుల మందులు కొన్నవారికే యూరియా ఇస్తున్నారు. పంటను కాపాడుకోవాలంటే తప్పని పరిస్థితుల్లో అధిక ధరలకు ఎరువులు, పురుగుముందుల కొనుగోలు చేయాల్సి వస్తోంది.
‘సాగర్’ వెతలు...
నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు రాక రైతులు పోరాటాలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దంకి బ్రాంచ్ కెనాల్ నుంచి పర్చూరు డివిజన్‌లో కోటపాడు, ద్రోణాదుల, పమిడిపాడు, నూతలపాడు మేజర్ల ద్వారా మొత్తం 72 వేల ఎకరాలకు సాగు నీరు రావాల్సి ఉంది. దిగువ ప్రాంతాలకు సాగు నీరురాక మాగాణి భూములన్నీ బీడుగా మారిపోతున్నాయి. జిల్లాలో వరి పండించే రైతులు వరిసాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, అపరాలు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రెండో జోన్ పరిధిలో యద్దనపూడి బ్రాంచి కాలువ కింద ఐదు వేల ఎకరాల్లో పంట ప్రశ్నార్థకంగా మారింది.
కన్నీటి సేద్యం
Published Thu, Nov 27 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement