గజ్వేల్, న్యూస్‌లైన్:
జిల్లాలో శనగ విత్తనాల ‘సబ్సిడీ’ పంపిణీపై గందరగోళం నెలకొంది. రెండేళ్ల క్రితం పంపిణీ చేసిన విత్తనాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ము రూ.20 లక్షలు సిద్ధంగా ఉన్నా వ్యవసాయశాఖ ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈసారైనా సబ్సిడీ సొమ్మును సక్రమంగా పంపిణీ చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి విత్తనాలను నేరుగా పంపిణీ చేయాలా? లేదా సబ్సిడీని మినహాయించుకుని పంపిణీ చేయాలా? అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపై ఒకటి రెండ్రోజుల్లో కలెక్టర్ అనుమతి తీసుకుని ముందుకెళ్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి సుమారు 40 వేలకు పైగా హెక్టార్లలో శనగ పంటను సాగు చేయడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ 24 వేల క్వింటాళ్ల సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. విత్తనాల కిలో ధర రూ.43.95 పైసలు ఉండగా 33 శాతం సబ్సిడీని మినహాయించుకుని రూ.29.30 పైసలకు ఇవ్వడానికి నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రైతులకు ‘సబ్సిడీ’ మొత్తం చెల్లింపు వ్యవహారంలో గందరగోళం నెలకొంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేయాలా? లేదా సబ్సిడీ మినహాయించుకొని విత్తనాలు పంపిణీ చేయాలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై త్వరలో కలెక్టర్ అనుమతి తీసుకుని ముందుకెళ్తామని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఏడీఏ(టెక్నికల్) రమేశ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రెండేళ్లకిందటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ కలెక్టర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టమవుతోంది.
పంపిణీకి నోచుకోని రెండేళ్ల కిందటి సబ్సిడీ సొమ్ము...
2011 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జిల్లాలో సబ్సిడీ విత్తనాల పంపిణీ జరిగింది. విత్తనాలను కొనుగోలు చేసే సమయంలోనే సబ్సిడీ అందించడం వల్ల ప్రతియేటా అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల పేరిట దళారులు, వ్యాపారులు పెద్దఎత్తున సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ దుస్థితిని నివారించడానికి ఈసారి వ్యవసాయ శాఖ విత్తనాలు పంపిణీ చేసే సమయంలో సబ్సిడీని విడుదల చేయలేదు. బహిరంగ మార్కెట్‌లో శనగ విత్తనాలు కిలోకు రూ.36 దొరుకుతుండగా అదే ధరపై తమ కేంద్రాల్లో విక్రయాలను చేపట్టింది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే కిలోకు సుమారు రూ.12కు పైగా సబ్సిడీని అందజేస్తామని, ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. వ్యవసాయ శాఖ ప్రకటనను నమ్మి జిల్లాలో రైతులు 1,700 క్వింటాళ్లకుపైగా శనగ విత్తనాలను కొనుగోలు చేసి వేలాది ఎకరాల్లో పంటను సాగుచేశారు.
ఇందులో భాగంగానే గజ్వేల్ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, తూప్రాన్, ములుగు, వర్గల్ మండలాల్లో 400 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా రైతులకు రూ.20 లక్షలకుపైగా సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉండగా ఒక్క గజ్వేల్ సబ్‌డివిజన్ ప్రాంతానికి చెందిన రైతులకే రూ.5 లక్షల వరకు సబ్సిడీ డబ్బులు అందాల్సివుంది. రెండేళ్లు గడుస్తున్నా ఈ వ్యవహారం ముందుకు కదలకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయా మండలాలనుంచి రైతుల ఖాతాలకు సంబంధించిన జాబితాలు రాకపోవడంతో ఇంతకాలం ఆలస్యం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అయితే 2012లో మాత్రం సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకొని డబ్బులు తీసుకోవడంవల్ల ఇబ్బంది తలెత్తలేదు.
సబ్సిడీ.. గడిబిడీ
Published Fri, Oct 4 2013 12:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement