ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన జరిగితే సీమాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో రాయలసీమ రైతు రక్షణ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహర దీక్షలకు ఆమె ఆదివారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగా ణ ఏర్పడితే కృష్ణానది నీరు జూరాల నుంచి శ్రీశైలానికి విడుదల కావన్నారు. ఇప్పటికే కర్ణాటకతో నీటి వాటా సమస్యలు పరిష్కారం కావ డం లేదన్నారు. మధ్యలో కొత్త రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్దాలు తప్పవని స్పష్టం చేశారు. కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మించిన తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారుతాయన్నారు. విభజనను అడ్డుకోవడానికి రైతులు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉద్యమకారులకు అండగా ఉంటాం:
జీవితాలను లెక్క చేయకుండా సమ్మె చేస్తున్న ఆందోళనకారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉద్యోగ జేఏసీ నాయకులకు ఆదివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీతాలు అందవని తెలిసి కూడా ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో అందరిలో ఉద్యమ స్ఫూర్తి పెరిగిందన్నారు. దీంతో రైతులు, విద్యార్థులు, మహిళలు ఉద్యమం వైపు వస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి పౌరుడు సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. కార్యక్రమాల్లో మిల్క్ డైయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, గంగాధర్‌రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు వరప్రసాదరెడ్డి, ఎన్జీఓ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, భార్గవ రామయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
విభజనతో రైతులకు తీరని నష్టం
Published Mon, Sep 9 2013 3:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement