సినిమాకు హాస్యమే ప్రాణం | film comedy for Passion | Sakshi
Sakshi News home page

సినిమాకు హాస్యమే ప్రాణం

Dec 17 2014 1:06 AM | Updated on Sep 2 2017 6:16 PM

సినిమాకు హాస్యమే ప్రాణం

సినిమాకు హాస్యమే ప్రాణం

‘నాటకానికైనా, సినిమాకైనా హాస్యమే ప్రాణం. హాస్యం లేకుండా ఏ ప్రదర్శనా రక్తికట్టదు’ అని ప్రముఖ హాస్య నటుడు పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ) అన్నారు.

పిఠాపురం :‘నాటకానికైనా, సినిమాకైనా హాస్యమే ప్రాణం. హాస్యం లేకుండా ఏ ప్రదర్శనా రక్తికట్టదు’ అని ప్రముఖ హాస్య నటుడు పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ) అన్నారు. పాదగయ క్షేత్రాన్ని ఆయన సోమవారం సతీ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి దేవి, పురుహూతికా అమ్మవారు, దత్తాత్రేయ స్వామివార్లను దర్శించుకున్నారు. పాదగయను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా అన్నారు. ఈఓ దారబాబు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.
 
 ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో  జెన్నీ మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకూ 400 సినిమాలు, వెయ్యి టీవీ కార్యక్రమాల్లో నటించాను. 100 రేడియో ప్రోగ్రాముల్లో చేశాను. ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా చేయడంవల్ల నాకు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ప్రపంచంలో మూకాభినయం చేసే తొలి కళాకారుడిగా నాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మూకాభినయ ప్రదర్శనలు ఇచ్చాను.
 
 మూకాభినయం చేయడం చాలా కష్టం. ఎంతో శ్రమకోర్చి నేర్చుకుని, ప్రదర్శించడం ద్వారా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాను. హాస్యనటులు నవ్వించడమే తెరపై ప్రేక్షకులకు కనిపిస్తుంది తప్ప వారు పడే కష్టం కనిపించదు. సినిమా కాలక్షేపం అయితే దానిలో హాస్యం మానసికోల్లాసానికి దోహదపడుతుంది. యమలీల, హలోబ్రదర్, రెడీ, దూకుడు, ఆగడు, ప్రాణదాత, మాయలోడు, ఠాగూర్, ఆంటీ సినిమాల్లో నేను చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం నితిన్ హీరోగా, తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ‘కొరియర్ బాయ్’, కళ్యాణ్, జగపతిబాబు నటిస్తున్న ‘ఒక మనిషి కథ’, ‘జగన్నాయకుడు’, ‘జన్మస్థానం’ తదితర ఏడు సినిమాల్లో నటిస్తున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement