ఐదుగురు డీఎస్పీలు బదిలీ | five DSPs transferred | Sakshi
Sakshi News home page

ఐదుగురు డీఎస్పీలు బదిలీ

Published Fri, Nov 29 2013 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM

five DSPs transferred

సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ డి.మోహన్‌రావ్‌ను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ జి.వేణుగోపాల్‌ను నియమించారు. అనంతపురం డీటీసీ డీఎస్పీ ఎన్. సుబ్బారావును పెనుకొండ డీఎస్పీగా, పెనుకొండలో డీఎస్పీగా ఉన్న జి.రామకోటేశ్వరరావును ఇంటలిజెన్స్ డీఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురం పీటీసీ డీఎస్పీ డి.నాగరాజును అనంతపురం డీఎస్పీగా, అనంతపురం డీఎస్పీ ఎన్.దయానందరెడ్డిని ఇంటిలిజెన్స్ డీఎస్పీగా బదిలీ చేశారు.
 
 చక్రం తిప్పిన మంత్రి రఘువీరా
 ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ తమ కనుసన్నల్లో పనిచేసే అధికారులను నియమించుకోవడంలో రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి క్రియాశీలకమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో తనకు చెక్ పెట్టేందుకు అప్పటి డీజీపీ దినేష్‌రెడ్డిపై జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమించిన మోహన్‌రావుపై బదిలీ వేటు వేయించారు. ఆ స్థానంలో తనకు
 విశ్వాసపాత్రుడైన వేణుగోపాల్‌ను నియమింపజేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, డీఎస్పీ ఎన్.సుబ్బారావు విద్యార్థి దశ నుంచే మంచి మిత్రులని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
 
 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు కళ్యాణదుర్గం డీఎస్పీగా ఎన్.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. తన మిత్రుడు కావడం వల్లే సుబ్బారావును ఏరికోరి కళ్యాణదుర్గం డీఎస్పీగా రఘువీరా నియమింపజేసుకున్నారని అప్పట్లో పోలీసు వర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగింది.
 
 స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా డీఎస్పీ సుబ్బారావు పనిచేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. వాటిపై విచారణ చేసిన ఎన్నికల సంఘం డీఎస్పీ సుబ్బారావుపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిని కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమిస్తే రఘువీరాకు చెక్ పెట్టవచ్చునని అప్పట్లో జేసీ దివాకర్‌రెడ్డి భావించారు. ఆ క్రమంలోనే తన బంధువైన అప్పటి డీఐజీ దినేష్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చి.. కళ్యాణదుర్గం డీఎస్పీగా మోహన్‌రావును నియమించేలా జేసీ దివాకర్‌రెడ్డి చక్రం తిప్పారు.
 
 దీనిపై పలు సందర్భాల్లో రఘువీరా తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇప్పుడు మోహన్‌రావును బదిలీ చేయించి రఘువీరా పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ స్థానంలో తనకు సన్నిహితుడైన వేణుగోపాల్‌ను నియమించుకోవడంలో రఘువీరా సఫలీకృతులయ్యారు. కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమితులైన వేణుగోపాల్ గతంలో ఉరవకొండ సీఐగా పనిచేశారు.
 
 స్థానిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన తన మిత్రుడు ఎన్.సుబ్బారావును పెనుకొండ డీఎస్పీగా నియమించుకోవడంలోనూ రఘువీరా విజయం సాధించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తనను బదిలీ చేయాలని చాలా కాలంగా కోరుతున్న అనంతపురం డీఎస్పీ దయానందరెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో డీఎస్పీగా పనిచేస్తోన్న డి.నాగరాజును నియమించారు. మంత్రి రఘువీరా ఆమోదముద్ర వేశాకే డి.నాగరాజును అనంతపురం డీఎస్పీగా నియమించారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో బలంగా విన్పిస్తోంది. గుంతకల్లు, ధర్మవరం డీఎస్పీలు సుప్రజ, నవాబ్‌జాన్‌లను కూడా బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement