ఐదేళ్లలో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తా
- త్వరలోనే గోదావరి, కృష్ణానదుల అనుసంధానం
- చిత్తూరు సభలో ఏపీ సీఎం
- రైతు రుణవిముక్తి పత్రం విడుదల
సాక్షి, చిత్తూరు: కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి వచ్చే ఐదేళ్లల్లో రాయలసీమతోపాటు రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయస్థాయిలో నదులు అనుసంధానం చేయాలని అనుకున్నప్పటికీ ముందు రాష్ట్రంలో దీనికి శ్రీకారం చుడుతున్నట్ల్లు చెప్పారు. చిత్తూరులో గురువారం నిర్వహించిన రైతు సాధికారిక సదస్సులో సీఎం పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి రైతు రుణవిముక్తి పత్రాన్ని విడుదల చేశారు.
అంతకుముందు బాబు పలు శంకుస్థాపన శిలాఫలాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గోదావరి నీళ్లు ఏడాదిలో 3వేల టీఎంసీలకుపైగా సముద్రం పాలవుతున్నాయని చెప్పారు. పోలవరం పూర్తిచేసి కుడి కాలువ ద్వారా కృష్ణానదికి 70 టీఎంసీల నీటిని తరలిస్తామన్నారు. అక్కడినుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, కండలేరు ద్వారా రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయడమే తన కల అని చెప్పారు. రూ.500 కోట్లు ఖర్చుచేస్తే గోదావరి నీటిని కృష్ణా నదిలో కలపవచ్చునన్నారు.
ప్రణాళికా సంఘాలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. ప్రణాళిక సంఘాల స్థానంలో ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటుచేయాలని సూచించినట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికా, చైనా కంటే భారతదేశం ముం దుంటుందన్నారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా రుణమాఫీ చేసి రైతుల భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నానని చెప్పారు. హంద్రీ-నీవా పూర్తయితేనే చిత్తూరు బాగుపడుతుందన్నారు. చెరువులు, చెక్‌డ్యాములు, కాలువలను ఆధునికీకరించి భూగర్భ జలాలు పెరిగేలా చూస్తానని చెప్పారు. సౌర విద్యుత్తును అభివృద్ధి చేసి రైతులకు ఏడు గంటల కరెంట్‌ను పగటి పూటే ఇస్తామన్నారు.