సాక్షి, అమరావతి: గతవారం రోజుల పాటు మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ క్రమేణా శాంతిస్తోంది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది.
దీంతో కృష్ణా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 9467, పశ్చిమ డెల్టాకు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్ తెలిపారు. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు మరోసారి మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన..
పెనమలురు ముంపు గ్రామాల్లో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్య కొలుసు పార్థసారధి ఆదివారం ఉదయం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. పునరావాసాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాలా ఆందుకుంటామని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్‌ను నిర్శించాలని అక్కడి స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment