ప్రజా సమస్యలపై దృష్టిపెట్టండి
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల విభాగానికి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆయా శాఖలకు చెందిన అధికారులకు అందజేశారు. ప్రజలకు సమస్యలు ఉండడంతోనే అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.
వారి సమస్యను మండల స్థాయి అధికారులు పరిష్కరించేలా చూడాలని, వారు పట్టించుకోకపోవడంతోనే ప్రజలు తన దాకా వస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, వారి సమస్యలు పరిష్కరించినట్లైతే వారి మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలపై దృష్టిసారించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్, డీఆర్వో ప్రసాదరావు, డీఎస్‌వో వసంత్‌రావు, డ్వామా పీడీ గణేశ్‌జాదవ్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. - ఆదిలాబాద్ అర్బన్