కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రత పథకం అధికారులకు పలహారంగా మారింది.
హుస్నాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రత పథకం అధికారులకు పలహారంగా మారింది. పప్పు దినుసుల సాగున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ అధికారులు పక్కదారిపట్టించారు. పైలట్ పథకం కింద జిల్లాలోని హుస్నాబాద్, రాయికల్, బెజ్జంకి మండలాల్లో ఆయా గ్రామాలను ఎంపిక చేశారు. గత సంవత్సరం రబీ సీజన్‌లో హుస్నాబాద్ మండలం అక్కన్నపేట, అంతకపేట గ్రామాలను ఎంపిక చేసి 250 ఎకరాల్లో పెసర పంట సాగుకు వ్యవసాయ శాఖ ప్రోత్సహించింది.
రైతులకు ఒక్కో ఎకరానికి ఎనిమిది కిలోల పెసర విత్తనాలు, 25 కేజీల జింక్‌సల్ఫేట్, 25 కిలోల డీఏపీ, 10 కిలోల యూరియాను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మాపూర్, మల్లంపల్లి, జిల్లెల్లగడ్డ గ్రామాల్లో 250 ఎకరాల్లో పంట సాగుకు రైతులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో 2.5 మెట్రి క్ టన్నుల డీఏపీ, మెట్రిక్ టన్ను యూరియా, 2500 కిలోల జింక్‌సల్ఫేట్, 20 కిలోల పెసర విత్తనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని వ్యవసాయాధికారి రైతులకు పంపిణీ చేయకుండా దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
గుట్టు రట్టు చేసిన అఖిలపక్ష నాయకులు
రైతులకు ఉచితంగా అందించాల్సిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయాధికారి పక్కదారి పట్టించాడని అఖిలపక్ష నాయకులు నాలుగు రోజుల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందేలోపే గత సంవత్సరం పంపిణీ చేయాల్సిన డీఏపీ బస్తాలను మండలంలోని గొల్లకుంటకు చెందిన ఆదర్శరైతు వెంకటస్వామి ఇంటికి రాత్రికి రాత్రే పంపిణీ చేసేందుకు ఏఓ తరలించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అఖిలపక్ష నాయకులు నిలువ ఉంచిన ఇంటిపై దాడి చేసి ఏడీఏలు రవీందర్‌జీ, కాంతారావులకు సమాచారం అందించారు. గత సంవ త్సరం పంపిణీ చేయాల్సిన డీఏపీ బస్తాలు న వంబర్ 2013 ముద్రణతో ఉన్న వాటిని పంపిణీ చేస్తుండగా వారు అడ్డుకున్నారు. ఈ బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం ప్రశ్నార్థకంగానే మిగిలింది.
రెండు సంవత్సరాలుగా ఈ అక్రమాలు జరుగుతున్నా మూడవ కంటికి తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం గురించి జేడీఏతోపాటు ఏఓకు మాత్రమే తెలిసి ఉండడంతో దీనిని అదునుగా భావించి స్వాహా పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి డివిజన్ వ్యవసాయాధికారి కాంతారావును విచారణకు ఆదేశించారు. రెతులకు పప్పు దినుసులను అందించినట్లు ఏఓ యూసీ ఇచ్చాడని, రైతుల పేర్లు, రికార్డులను ఇవ్వకపోవడం వల్ల విచారణలో జాప్యం జరుగుతోందని కాంతారావు తెలిపారు.