కాంగ్రెస్ క్షేమాన్ని కోరేవారు 23 తర్వాత తేలతారు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ క్షేమాన్ని కోరేవారు ఈ నెల 23వ తేదీ తర్వాత తేలతారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సంక్షోభం నేపథ్యంలో పార్టీలో ఎవరు ఉంటారో 23వ తేదీ తర్వాత తేలుతుందన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన సమావేశంలో రఘువీరా మాట్లాడారు. నాలుగైదు నెలల నుంచి కొందరు నేతలు పార్టీపై నిందలు మోపుతున్నారని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని విమర్శిస్తున్నా భరిస్తున్నామన్నారు. ఒక బాధ్యతగల అంశం తమపై ఉందని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరాహారదీక్షలు చేసేది కాదన్నారు. విభజన ప్రకటన ముందు వరకు సీపీఎం మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టేందుకు మధ్యప్రదేశ్‌లో కమలం కండువాలు వేసుకుందని విమర్శించారు. తొమ్మిదేళ్ల నుంచి విభజన డిమాండ్ ఉన్నప్పటికీ తాము మాత్రం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. మంత్రి మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారన్న ప్రచారాన్ని ఖండించిన మహీధర్ రెడ్డి.. తమకు డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలు తగ్గిపోయాయని, నామినేటెడ్ పోస్టులు రాలేదంటూ కొంతమంది బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
మీసాలు తిప్పుతూ .. చేతులు ఒత్తుతూ..
కార్యకర్తల సమావేశంలో మంత్రి రఘువీరా తన సహచర మంత్రి మహీధర్‌రెడ్డి మీసాలు తిప్పుతూ.. చేతులు ఒత్తుతూ కాలక్షేపం చేశారు. మీడియా ఎదురుగా ఉందన్న విషయాన్ని పట్టించుకోని రఘువీరా.. మహీధర్‌రెడ్డి మీసాన్ని నాలుగైదుసార్లు అదేపనిగా తిప్పుతూ కూర్చున్నారు. మహీధరరెడ్డి ప్రసంగించిన తర్వాత ఆయన చేతిని రఘువీరారెడ్డి ఒత్తుతూ కూర్చున్నారు.
అధ్యక్షుడు ఔట్.. కలెక్టర్ ఇన్..
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు నాయకులు, కార్యకర్తలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో సమావేశం అవుతున్నట్లు ముందుగానే ప్రకటించారు. అనుకున్న సమయానికి కొంచెం అటు ఇటుగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మంత్రి మహీధర్ రెడ్డి ఉన్నారు. కొండపి, కనిగిరి శాసనసభ్యులు జీవీ శేషు, ఉగ్రనరసింహారెడ్డి కూడా వచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీని భుజస్కందాలపై వేసుకున్న అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ ఆ చాయల్లో కనిపించలేదు. ఒంగోలులో లేరా అని అనుకుంటే పొరబడినట్లే. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆధునికీకరణ కార్యక్రమంలో ఆమంచి పాల్గొన్నారు. అయితే జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మొహం చాటేశారు. ఆయనతోపాటు పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కూడా రాలేదు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ విజయకుమార్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. మంత్రులు రఘువీరారెడ్డి, మహీధరరెడ్డి బయటకు వచ్చి తమ వాహనాల్లో ఎక్కారు. కలెక్టర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వాహనంలో వారిని అనుసరించారు.