'మా తప్పు ఉందని ఒప్పుకుంటున్నాం'
హైదరాబాద్ : రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాత్ర ఉందని అంగీకరిస్తున్నామని మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నుంచి కిందస్థాయి నేతల వరకూ చేసిన సమైక్య ప్రయత్నాలు విఫలం అయ్యాయని అన్నారు. విభజనలో తమ తప్పు ఉందని ఒప్పుకుంటున్నామని వారు అంగీకరించారు. ఇన్నాళ్లు పదవులు అనుభవించి... ఇప్పుడు కాంగ్రెస్ కష్టాల్లో, నష్టాల్లో ఉందని వెన్ను చూపడం ....సీఎం కిరణ్ నుంచి కిందిస్థాయి నేతల వరకూ తగదని ఆనం, రఘువీరా వ్యాఖ్యానించారు.
తాము జిల్లా కాంగ్రెస్కు అధ్యక్షులుగా పని చేయటానికి కూడా సిద్ధమని పీసీసీ అధ్యక్షుడికి తెలిపామని మంత్రులు చెప్పారు. సీఎం సహా కాంగ్రెస్కు రాజీనామా చేస్తామంటున్న పలువురు నేతలు పునరాలోచన చేసుకుని పార్టీలోనే కొనసాగాలని కోరుతున్నామన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏంకావాలో చెప్పడంలో అన్ని పార్టీలు విఫలం అయ్యాయన్నారు.
ఇందులో మీడియాకు భాగస్వామ్యం ఉందని ఆనం, రఘువీరా వ్యాఖ్యానించటం విశేషం. వైఫల్యాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని.... ఇక నుంచి సీమాంధ్రకు కావాల్సినవి అడిగి సాధించుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు, రాష్ట్రపతి పాలనకు అవకాశాల గురించి నిన్న గవర్నర్ నరసింహన్తో చర్చించినట్లు పేర్కొన్నారు.