ఒంగోలు, న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం గ్యాస్ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకున్న వారికే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము అందుతుందని, అది కూడా నేరుగా వినియోగదారుని బ్యాంకు అకౌంట్‌కు జమవుతుందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం రెండో దశలో ప్రకాశం జిల్లా ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆధార్ కార్డు పొందనివారికి మూడు నెలల గడువిచ్చారు. ఈ మూడు నెలలపాటు వారికి నెలకు రూ. 411లకే సిలిండర్ అందుతుంది. కానీ ఆధార్ సమర్పించిన వారికి మాత్రం భారీ బాదుడు తప్పడం లేదు.
బాదుడు ఇలా...
ఆధార్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోగానే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 435 సబ్సిడీ జమవుతుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1037. అంటే వినియోగదారుడు అదనంగా రూ. 602 సిలిండర్‌కు వెచ్చించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వినియోగదారుడు భరించాలి. కానీ గతంలో సబ్సిడీ మొత్తం పోను సిలిండర్‌కు రూ. 411 మాత్రమే వసూలు చేసేవారు. ఈ లెక్కన ప్రతి సిలిండర్‌పైన వినియోగదారునికి అదనంగా పడుతున్న భారం రూ. 191. అయితే ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి మరో మూడు నెలల గడువు పొడిగించడం వల్ల ఈ మూడు నెలలపాటు వారు బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్ కేవలం రూ. 411కే డెలివరీ అవుతుంది. అంటే ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన వారిపై అదనపు భారం పడుతుందన్నమాట.
జిల్లా వ్యాప్తంగా 5,56,971 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వాటిలో ఆధార్ తీయించుకున్నవారు 2,75,387 మంది ఉన్నారు. అంటే ఇంకా 2,81,584 మంది ఆధార్ తీయించుకోవాల్సి ఉంది. ఆధార్ తీయించుకున్న వారిలో సబ్సిడీ కోసం గ్యాస్ కంపెనీల వద్ద నమోదు చేయించుకున్నవారు 1,22,654 మంది మాత్రమే. ఆధార్ తీయించుకున్న వారిలోనే మరో 1,52,733 మంది వినియోగదారులు సబ్సిడీ కోసం నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఇవి కాకుండా మొత్తం కనెక్షన్ల పరంగా చూస్తే ఫీడ్ చేయించుకోవాల్సిన వినియోగదారుల సంఖ్య 4,34,317 మంది వరకు ఉంది. వారంతా ఈ మూడు నెలలపాటు ఈ భారం నుంచి మినహాయింపు పొందినట్లే. మరోవైపు నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రోజురోజుకూ మార్కెట్లో పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం రూ. 1037లకు చేరింది. ఆధార్ నమోదుచేయించుకోకపోతే సబ్సిడీ అందదని, గ్యాస్ కనెక్షన్ కాస్తా నాన్ సబ్సిడీగా మారుతుందనే భయంతోనే వినియోగదారులు ఆధార్ నమోదుకు పోటీపడ్డారు.
ఆధార్ భారమే: ఇప్పటి వరకు గ్యాస్‌కు రూ. 435ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 50 సబ్సిడీ ఇచ్చేది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సబ్సిడీ కాస్తా రూ. 50 నుంచి రూ. 25లకు పడిపోయింది. వాటితోపాటు చమురు కంపెనీలు పన్నుల రూపంలో సుమారు రూ. 62 అదనపు భారాన్ని వినియోగదారులపై రుద్దుతున్నాయి. ఈ రెండు మొత్తాలను మినహాయిస్తే అంటే రూ. 87 మినహా మిగిలిన మొత్తం త్వరలో బ్యాంక్ ఖాతాలకు జమయ్యే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా భావించినా గ్యాస్ సిలిండర్‌పై రూ.87 పెరిగిందని స్పష్టమవుతోంది.
పల్లెల్లో తప్పని పాట్లు: పల్లెల్లో ఒకటి రెండు బ్యాంకు శాఖలు మాత్రమే ఉంటాయి. ఇంకా అన్ని చోట్ల ఏటీఎంలు ఏర్పాటు చేయలేదు. దానికితోడు ఇప్పటికీ ఏటీఎం కార్డులను ఎలా వినియోగించాలో తెలియని వారు చాలామందే ఉన్నారు. దీంతో గ్యాస్ బుక్‌చేసుకున్నా తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంకు ఉన్న గ్రామాలకు వె ళ్లడం, వాటిని డ్రా చేసుకోవడం అనేది వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. కేవలం జనాన్ని తిప్పలు పెట్టడం కాకపోతే ప్రభుత్వం నేరుగా సంబంధిత కంపెనీలకు సబ్సిడీ మొత్తం ఇస్తే ఈ సమస్యలు ఉండవు కదా అంటూ పల్లె ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ వినియోగం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గ్యాస్ వినియోగదారులు ఊరట చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మరలా పిటీషన్ దాఖలు చేయడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ఆధార్ అనుసంధానంతో గ్యాస్ వినియోగదారులపై భారం
Published Sat, Sep 28 2013 6:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement