రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు తలెత్తవని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి గీతారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు, ప్రకటించిన రాయితీలకు కూడా ఢోకా ఉండదని స్పష్టంచేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు తలెత్తవని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి గీతారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు, ప్రకటించిన రాయితీలకు కూడా ఢోకా ఉండదని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియ నేపథ్యంలో సీఐఐ, ఫ్యాప్సీ, ఫిక్కీ తదితర పారిశ్రామిక సంఘాలతో మంత్రి సోమవారమిక్కడి ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల పరిశ్రమలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన విద్యుత్, పరిశ్రమల ఆస్తుల భద్రత, ఉద్యోగుల భద్రత, ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ తదితర అంశాలను పారిశ్రామిక సంఘాలు ప్రస్తావించాయని వెల్లడించారు.
రాష్ట్ర ఏర్పాటుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని, విభజన తర్వాత కూడా రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించినట్టు చెప్పారు. విభజనతో పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ అశోక్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందన్నారు. సీమాంధ్రలో అదనపు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ అది అధిక ధరకు లభించనుందని సీఐఐ మాజీ చైర్మన్ (ఏపీ) హరిశ్చంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.
భద్రత ఉంటుందా?: విభజన ప్రక్రియ నేపథ్యంలో తమ ఆస్తులతోపాటు ఉద్యోగుల భద్రత అంశంపై పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలోని పరిశ్రమలకు విద్యుత్ కొరత సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని కూడా అభిప్రాయపడ్డట్టు సమాచారం.