ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఏఈ
శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈ సురేష్‌కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జీహెచ్‌ఎంసీ శేరి లింగంపల్లి సర్కిల్-12లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తాత్కాలిక లైటింగ్ ఏర్పాటుతో పాటు.. సీఎం పర్యటన సందర్భంగా మాణిక్యం అనే కాంట్రాక్టరు పలు పనులు చేశారు. వాటికి సంబంధించి రూ. 4 లక్షల బిల్లు రావాల్సి ఉంది. అయితే, ఎలక్ట్రికల్ ఏఈ ఆర్.సురేశ్‌కుమార్ బిల్లులు మంజూరు చేయకుండా మాణిక్యాన్ని తిప్పించుకున్నాడు.
బిల్లు సిద్ధమైనా దానిమీద సంతకం చేయకుండా కొద్దిరోజులు ఇబ్బందులకు గురిచేశాడు. చివరికి ప్రింటర్, యూపీఎస్ లంచంగా ఇస్తే బిల్లులపై సంతకాలు చేస్తానని చెప్పాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు సిటీరేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్‌కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వ్యూహం పన్ని.. ఏఈ సురేష్‌కుమార్‌కు సదరు కాంట్రాక్టర్ ప్రింటర్, యూపీఎస్, రసీదులను అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేశామని, కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సురేశ్‌కుమార్ ఇళ్లపై అనంతరం ఏసీబీ అధికారులు దా డులు చేశారు. ఎటువంటి అక్రమ ఆస్తుల వివరాలు లభించలేదని తెలిపారు.