
చుక్కల మందుకు చక్కని స్పందన
విజయనగరం ఆరోగ్యం: పల్స్‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది. కార్యక్రమంలో భాగంగా తొలిరోజే లక్ష్యానికి చేరువగా 98.22శాతం మందికి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలు 2,42, 416 మందికి పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 2,38,101మంది పిల్లలకు వేశారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1600 బూత్‌లలో పోలియో చుక్కలు వేసేందుకు గాను 3200 టీమ్‌లను ఏర్పాటు చేశారు. 160 మంది ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌లు పిల్లలకు పోలియో చుక్కలు వేసారు. డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి విజయనగరంపట్టణం, రామతీర్థం, నెలిమర్లలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదనపు వైద్యారోగ్యశాఖాధికారి సి.పద్మజ పోలిపల్లి,మెంటాడ, తెట్టంగి, తెర్లాంలలో పర్యవేక్షించారు. డీటీసీఓ రామారావు సాలూరు నియోజకవర్గం పరిధిలో పర్యవేక్షించారు. గరివిడి, చీపురుపల్లిలలో మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ పర్యవేక్షించారు. పార్వతీపురం, నీలకంఠాపురం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భాస్కర్‌రావు, గజపతినగరం నియోజకవర్గం పరిధిలో జైబార్ కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.