‘గోవాడ’ రైతులకు చేదు కబురు | 'Govada' bitter summoned to farmers | Sakshi
Sakshi News home page

‘గోవాడ’ రైతులకు చేదు కబురు

Published Tue, Sep 30 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

‘గోవాడ’ రైతులకు చేదు కబురు

‘గోవాడ’ రైతులకు చేదు కబురు

  • మద్దతుధరపై నిరాశమిగిల్చిన యాజమాన్యం
  •  నిరసన వ్యక్తం చేసిన రైతులు
  •  ఫ్యాక్టరీలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్
  • చోడవరం : గోవాడ సహకార చక్కెరమిల్లు మహాజనసభ సభ్యరైతులను నిరాశపరిచింది. గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నలకు యాజమాన్యం ప్రకటన తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రానున్న సీజన్‌కు సంబంధించి మద్దతు ధర ప్రకటించకపోగా, గతేడాది సరఫరా చేసిన చెరకు టన్నుకు రూ.2350 మాత్రమే చెల్లిస్తామని చైర్మన్ గూనూరు మల్లునాయుడు తెలిపారు. గోవాడ సుగర్స్ 44వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణంలో సోమవారం జరిగింది. తొలుత 2013-14 నివేదికను ఎమ్‌డీ వి.వి.రమణరావు చదివి వినిపించారు.

    అనంతరం 2014-15 అంచనా నివేదికను వివరించారు. అధ్యక్షోపన్యాసంలో చైర్మన్ మల్లునాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఫ్యాక్టరీని 4వేల టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. మార్కెట్‌లో పంచదారకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు ధర ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఫ్యాక్టరీలో లోపాలు, మద్దతు ధరపై పలువురు రైతులు సభలో మాట్లాడారు. మా డుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మద్దతు ధరను రూ.2800కు మించి చెల్లించాలన్నారు.

    మదుపులు బాగా పెరిగిపోయినందున కనీసం రూ.2600లయినా ఇవ్వాలన్నారు. మూడేళ్ల కిందట టన్నుకు రూ.2500లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారని, అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల న్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ ప్రస్తుతం 5వేల టన్నుల కెపాసిటీకి ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదన్నారు.

    ప్రస్తుతం ఉన్న మిషనరీని సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు గతంలో సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయాలని చూశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చెరకు రైతులను ఆదుకొని ఫ్యాక్టరీలను నిలి పారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా టన్నుకు రూ.200లు చొప్పున రైతులకు ప్రోత్సాహకం ఇచ్చిందని, అధికార పార్టీ పాలకవర్గం, ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తెచ్చి దానిని కొనసాగించాలన్నారు.

    ఈ సీజన్‌కు టన్నుకు రూ. 2800 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ప్రభుత్వానికి  అమ్మే కరెంటు ధర పీపీని రద్దు చేసి యూనిట్‌కు రూ. 9 ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ధర్మశ్రీ చెప్పారు. ప్రతి పక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు.
     
    అవినీతి అరోపణలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే రాజు

    గోవాడ సుగర్ ప్యాక్టరీలో అవినీతి చోటుచేసుకుం దంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ కమిటీ వేయాలని చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు నివృత్తిచేసుకోకపోతే పాలకవర్గానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు తక్షణం కమిటీని  వేయాలన్నారు. టన్నుకు రూ.2500 మద్దతు దర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    తీర్మానాలు : మహాజనసభలో పలు తీర్మానాలు చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌కు టన్నుకు  రూ.2350 మద్దతు ధరను చైర్మన్ మల్లునాయుడు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్ సామర్థ్యం పెంచేం దుకు రూ.24కోట్లతో ఆధునికీకరణకు ప్రతిపాదన, కరెంటు పీపీ రద్దు, పంచదార అమ్మకాలపై వ్యాట్ రద్దు, మొలాసిస్ అమ్మకాలపై అదనపు పన్ను రద్దు, ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని గ్రీన్ బెల్టుగా రూపొందించే పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు.
     
    రైతులకు ప్రోత్సాహకాలు :  మునుపెన్నడూలేని విధంగా సభ్యరైతులకు ఫ్యాక్టరీ నిధులతో ఒకొక్కరికి ఒక స్టీల్ క్యారేజ్‌ను ప్రోత్సాహకంగా అందజేసింది. వీటిని సభలో నాయకులు రైతులకు అందజేశారు.
     
    ఉత్తమ రైతులకు సత్కారం : ఫ్యాక్టరీ పరిధిలో ఆధునికీకరణ పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధించిన ఇద్దరు రైతులను సభలో సత్కరించారు. వారాడకు చెందిన యడ్ల తాతయ్యలు, సింహాద్రిపురం శివారుకు చెందిన సబ్బవరపు వెంకటరమణలను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement