గవర్నర్ కీలక సమీక్షలు | Governer Narasimhan plays quick role between parties | Sakshi
Sakshi News home page

గవర్నర్ కీలక సమీక్షలు

Published Sat, Mar 8 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

గవర్నర్ కీలక సమీక్షలు

గవర్నర్ కీలక సమీక్షలు

సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికలతో పాటు ఏడు కీలకాంశాలపై సమీక్ష
జాబితాలో శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరా
 

 సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఏడు కీలకాంశాలపై గవర్నర్ ఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు రాజ్‌భవన్ కార్యాలయం శనివారం ఈ మేరకు నోట్ పంపింది. సాధారణ ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితి, గ్రామీణ తాగునీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష జరగనుంది.
 
 గవర్నర్ ఎన్నికల సమీక్ష నిర్వహించవచ్చా?

 ఎన్నికల వ్యవహారాలపై సమీక్ష జరుపుతానన్న గవర్నర్ ప్రకటన అధికార వర్గాల్లో చర్చనీయంగా మారింది. సోమవారం ఆయన ప్రధానంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితరాలపై నేరుగా సమీక్ష నిర్వహించనుడటం విశేషం. సాధారణంగా ఎన్నికైన ప్రభుత్వం ఉనికిలో ఉంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ సమీక్షించరాదు. వారు నిర్వహించే సమీక్షలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులెవరూ నియమావళి అమల్లో ఉండగా వెళ్లరాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పాలన కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రివర్గం లేనందున గవర్నరే పాలనాధిపతిగా ఉన్నారు.
 
 ఓటర్లను ప్రభావితం చేస్తారనే కారణంతో ముఖ్యమంత్రి, మంత్రులనే ఎన్నికల ఏర్పాట్ల సమీక్ష నుంచి ఈసీ పక్కన పెట్టింది. మరిప్పుడు వారి స్థానంలో ఉన్న గవర్నర్ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించవచ్చా అంటూ అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. గవర్నర్‌ను నియమించేది కేంద్రమే గనుక ఆయన ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడమంటే రాజకీయంగానే పరిగణించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. తక్షణావసరాలు, శాంతిభద్రతల పర్యవేక్షణకే గవర్నర్ పరిమితం కావాలని, అలాగాక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన మౌలికాంశాల్లోకి వెళ్లడమంటే రాజకీయమే అవుతుందని ఉన్నతాధికారి ఒకరన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక అధికార యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లిపోతుంది. ఈసీ ఆదేశాల మేరకే పని చేస్తుంది. అయితే నియమావళిలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ గురించే ఉంది తప్ప గవర్నర్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
 
 పరిశీలించాలి: సీఈవో కార్యాలయం

 ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సంప్రదించగా, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదురవలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏం చేయాల్సి ఉంటుందో పరిశీలించాల్సి ఉందన్నారు.
 
 గవర్నర్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు
 సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆయనకు 11.35 దాకా వైద్యులు పలు పరీక్షలు జరిపారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్‌తో పాటు డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ లిజా రాజశేఖర్ గవర్నర్‌కు వైద్య సేవలు నిర్వహించారు. నిమ్స్ పాత భవనంలో సీటీ స్కాన్, కొత్తగా కట్టిన స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో పల్మనరి ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్‌టీ) జరిగాయి. సాధారణ రక్త పరీక్ష తదితరాలు కూడా జరిపారు.
 
 సాధారణ ఎన్నికల తరువాత అయితే నే మేలు!
 సాక్షి, హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరువాత నిర్వహిస్తే బావుంటుందన్న అభిప్రాయంతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉన్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతుందన్న అభిప్రాయాన్ని అధికారులతో వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారని, గ్రామాల్లో అనవసర ఆందోళనలు తలెత్తుతాయని గవర్నర్ వ్యాఖ్యానించారని అధికారవర్గాలు వివరించాయి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల సంఘానికి ఇవ్వడం ద్వారా తమ బాధ్యత తీర్చుకోవాలని పంచాయతీ అధికారులు, రిజర్వేషన్లు రాగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement