పార్వతీపురం టౌన్: పార్వతీపురం మండలం కోరి –గంగాపురం పంచాయతీ పరిధిలోని బడేదేవర కొండపై గ్రానైట్ తవ్వకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా దీనిపై ప్రత్యేక జాయింట్ సర్వే చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రస్థాయి అధికారులు సోమవారం బడేదేవర కొండకు చేరుకున్నారు. ఈ కొండపై ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు అక్రమమని ఒకవైపు వైఎస్సార్‌సీపీ మరోపక్క గిరిజన సంఘాలు పోరాడుతున్నాయి. దీనిపై తొలుత జిల్లా స్థాయిలో రెవెన్యూ, అటవీశాఖలు ఇచ్చిన నివేదికలు వేర్వేరుగా ఉండటం, కోరీ–గంగాపురం పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ –1లో గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులివ్వగా వారు ఎన్.ములగ పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ –1లో తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీరు తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం రిజర్వు ఫారెస్టులో ఉందంటూ పార్వతీపురం పట్టణానికి చెంది పట్లాసింగ్ రవికుమార్, ములగ ప్రకాష్ అనే వ్యక్తులు హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్‌ను స్వీకరించిన హైకోర్టు బడేదేవర కొండపై పూర్తి సర్వేచేసి నివేదికను సమర్పించాలని రాష్ట్ర అధికారుల బృందాన్ని ఆదేశించింది.
ఇందులో బాగంగానే సోమవారం సర్వే సెటిల్‌మెంట్సు కమిషనర్ విజయమోహన్, సర్వే డిపార్ట్‌మెంట్ సహాయ సంచాలకుడు గోపాలరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే డి.బి.డి.బి.కుమార్, మైన్స్ డీడీ శ్రీధర్, ప్రిన్సిపల్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్టు పి,కె.సారంగి, విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రాహుల్ పాండే, డీడీ హెడ్‌క్వార్టర్ ఏ.వెంకటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏ.వి.ఎస్.ప్రసాద్, డీఎఫ్‌ఓ జి.లక్ష్మణరావు, ఆర్డీఓ గోవిందరావు, తహసీల్దార్ అజూరఫీజాన్ బడేదేవర కొండను సందర్శించారు. ఈ మూడు శాఖలకు సంబంధించిన రికార్డులను, మ్యాప్‌లను పరిశీలించారు.
పాకలో చర్చలకే పరిమితం
స్పెషల్ కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ సీహెచ్.విజయ్‌మోహన్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం బడే దేవరకొండ పరిసరాలను గానీ... కొండపై తవ్వకాలను గానీ పరిశీలించలేదు. కొండదిగువ ఉన్న ఒక పాకలో వారంతా కూర్చొని రికార్డులను, మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే అధికారులు చర్చించుకున్నారు తప్ప వారు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు. కాగా దీనిపై మరోసారి సర్వే చేపట్టాలని అనంతరమే నివేదిక సమర్పించగలమని.. ఇందుకోసం మరో మరో 45 రోజులు గడువు కోసం హైకోర్టును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వచ్చారు... వెళ్లారు...
Published Tue, Jun 6 2017 10:24 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
Advertisement
Advertisement