సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: దేశ రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-7ను ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 30న ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. 2,550 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచి అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్-వీఏ215 ఉపగ్రహ వాహకనౌక ద్వారా నింగికి పంపనున్నారు. ఇస్రో ఇప్పటి దాకా 23 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించగా జీశాట్-7 ఇరవైనాలుగో సమాచార ఉపగ్రహం. ఈ తరహా బరువైన సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో ‘జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)’ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించింది.
అయితే.. జీఎస్‌ఎల్‌వీ సాంకేతిక పరిజ్ఞానంలో కాస్త వెనుకబడి ఉండటంతో బరువైన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష సంస్థ సహకారంతో ప్రయోగిస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థకు విలువైన సమాచారాన్ని అందించేందుకు మల్టిపుల్ బాండ్ ఆల్ట్రా హై ఫ్రీక్వెన్సీతో కూడిన ఎస్-బాండ్, సీ-బాండ్, హై క్వాలిటీ కేయూ-బాండ్ పరికరాలను జీశాట్-7లో అమర్చారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఐసాక్ కేంద్రం, అహ్మదాబాద్‌లోని స్పేస్ అఫ్లికేషన్ సెంటర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి ఈ నెల 19న జీఎస్‌ఎల్‌వీ డీ-5 ద్వారా జీశాట్-14ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేయగా.. సాంకేతికలోపంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
30న జీశాట్-7 ప్రయోగం
Published Fri, Aug 23 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement