‘గద్దె‘కు మొండిచెయ్యే
- మరోసారి అవమానం తప్పదా?
- సీటుపై హామీ ఇవ్వని చంద్రబాబు
- పోటీ నుంచి తప్పుకొనేందుకు అనూరాధ సిద్ధం!
- యలమంచిలి రవి ఇంటి వద్ద కోలాహలం
సాక్షి, విజయవాడ : మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి గద్దె రామ్మోహన్‌కు ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమౌతోంది. గతంలో గన్నవరం ఎమ్మెల్యే సీటు, ఆ తరువాత విజయవాడ ఎంపీ సీటు ఆశించి భంగపడినప్పటికీ.. ఈ అవమానాలన్నింటినీ దిగమింగుకుంటూ అదే పార్టీలో ఆయన కొనసాగుతున్నారు.
ఈసారి ఎంపీ సీటు కావాలంటూ నాలుగైదు నెలల క్రితం బహిరంగంగానే ప్రకటనలు గుప్పించిన గద్దె రామ్మోహన్ చివరకు విజయవాడ తూర్పు సీటు ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆయన కుటుంబ స్థాయిని చంద్రబాబు జెడ్పీకే పరిమితం చేశారని పార్టీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తనను తప్పించి.. భార్యకు సీటిచ్చి..
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్‌ను తప్పించేందుకు ఆయన భార్య అనూరాధకు జెడ్పీ చైర్మన్ సీటు ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా అనూరాధ నామినేషన్ వేసిన తరువాత తన భర్తకు ఎమ్మెల్యే సీటు గురించి తేల్చుకునేందుకు వారిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. శనివారం వారు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా, ఆయన మాట్లాడేందుకు సుముఖంగా లేరని తెలిసింది.
ముందు జెడ్పీ ఎన్నికలపై దృష్టి పెట్టండని మాత్రమే చెప్పారు తప్ప తూర్పుపై ఎటువంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన ఇతర వివరాలను జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరితో మాట్లాడమని సూచించినట్లు సమాచారం. తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవిని పార్టీలోకి తీసుకోవడంపై గద్దె దంపతులు సుజనాచౌదరిని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆయన్ని బేషరతుగా మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నామని, ఎమ్మెల్యే సీటు హామీ ఏమీ ఇవ్వలేదని, అందువల్ల కంగారుపడాల్సిన పనిచేదని సుజనా చౌదరి చెప్పినట్లు సమాచారం.
పోటీ నుంచి తప్పుకొంటానని అనూరాధ అల్టిమేటం?
ఈ నెల 25లోగా తన భర్తకు తూర్పు నియోజకవర్గం సీటు ఇచ్చే విషయం తేల్చకపోతే ఆరోజు జెడ్పీ చైర్మన్ పోటీ నుంచి తప్పుకొంటానని అనూరాధ పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 25 వరకు ఏదోవిధంగా నాన్చివేత ధోరణి చూపి, ఆ తర్వాత తన భర్తకు మొండిచెయ్యి చూపితే.. తాను ఏమాత్రం సహించబోనని, తొలి నుంచి తన భర్త సీటుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె సుజనాచౌదరి వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు తెలిసింది.
యలమంచిలి రవి ఇంటి వద్ద కోలాహలం...
కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని, ఆ తరువాత తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గద్దె రామ్మోహన్ ఆశీస్సులలో కార్పొరేటర్ సీటు పొందినవారు కూడా శనివారం సాయంత్రం నుంచి యలమంచిలి శిబిరంలో దర్శనమిస్తున్నారు. రవి ఒకడుగు ముందుకేసి టీడీపీ జాబితాలను తెప్పించుకుని కార్పొరేటర్ అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద కోలాహలం కనపడుతోంది.