నిజాయతీ చాటుకున్న హైదరాబాద్ ఆటోడ్రైవర్
హైదరాబాద్: తన ఆటోలో విదేశీ ప్రయాణికులు మరిచిపోయిన డాలర్ల కట్టను తిరిగి అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌కు చెందిన ఆటోడ్రైవర్ పి.వి.శంకర్‌రావు మంగళవారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రి వద్ద కెన్యాకు చెందిన రోగి గాడ్‌ఫ్రె కిషాహ్ గగన్‌ను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. పేషంట్‌తోపాటు అటెండెంట్ ఫిలిప్స్ కోబా ఆల్ఫ్రెడ్ కూడా ఆటో ఎక్కాడు. వీరిని బంజారాహిల్స్‌లో దింపాక ఆటో తీసుకుని శంకర్‌రావు వెళ్లిపోయాడు. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో వెనుకసీటులో డాలర్ల బండిల్‌ను గమనించాడు.
అది విదేశీయులదేనని భావించిన శంకర్‌రావు వెంటనే అపోలో ఆస్పత్రికి వెళ్లాడు. సెక్యూరిటీ మేనేజర్ యాదగిరిరెడ్డిని కలిసి డాలర్ల బండిల్‌ను అప్పగించి.. విదేశీయులకిమ్మని చెప్పాడు. రాత్రి 7.30 గంటలకు కెన్యా దే శీయులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక డాలర్ల బండిల్ పోయిన విషయాన్ని గుర్తించారు. ఆటోలో మర్చిపోయి ఉంటామని భావించిన వారు.. విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి విచారించగా డాలర్ల బండిల్‌ను ఆటోడ్రైవర్ అప్పగించిన విషయం తెలిసింది. వీటి విలువ రూ.3.50 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. నిజాయతీగా తమ సొమ్మును అప్పగించిన ఆటోడ్రైవర్‌ను అభినందించి.. పారితోషికంగా 200 డాలర్లు ఇచ్చారు. ఆటోడ్రైవర్‌ను బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పి.మురళీకృష్ణ కూడా అభినందించారు.