రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో రాజకీయాలను నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్టానంతో ఏం డీల్ కుదుర్చుకున్నారో వెల్లడించాలని నెహ్రూ డిమాండ్ చేశారు. ఆ డీల్ వివరాలు సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
యూపీఏ అధ్యక్షురాలు సోనియా ఏం చెప్పిందో మంత్రులు, ఎంపీలు వెళ్లడించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే విభజన నిర్ణయాన్న వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పి. గౌతం రెడ్డి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలోని వి.ఎం.రంగా విగ్రహం ఎదుట ఉన్న రహదారిపై వంగవీటి రాధా రాస్తారోకో నిర్వహించారు. దాంతో బారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగర కాంగ్రెస్ కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు తాళం వేశారు.