
అనంతపురం టౌన్ : శనివారం దసరా పండుగ.. ఆదివారం సెలవు.. అదే రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం పెళ్లి. ఈ వివాహానికి ప్రముఖులు విచ్చేయనున్నారు. ప్రభుత్వ సెక్రటరీ సునీత, కమిషనర్ అరుణ్‌కుమార్ ఒక రోజు ముందుగానే (30వ తేదీ) అనంతకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అంగన్‌వాడీలను తనిఖీ చేస్తారని అందువల్ల సెలవు రోజుల్లోనూ కొన్ని అంగన్‌వాడీ సెంటర్లను తెరిచే ఉంచాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశం మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గురువారం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు మంత్రి కుమారుడి పెళ్లి వస్తే...తాము పండుగరోజున కూడా పనిచేయాలా..? అని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళతాము పనిచేసినా సెలవు రోజుల్లో సెంటర్లకు పిల్లలను ఎలా పిలుచుకురావాలని ప్రశ్నిస్తున్నారు.
అసలు ఏ సెంటర్లను వారు తనిఖీ చేస్తారో కూడా తెలియని నేపథ్యంలో అందరూ సెంటర్లలోనే ఉండాలా? లేదా? అన్న సంశయంలో పడ్డారు. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ వెంకటేశంను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘30వ తేదీన ఉన్నతాధికారులు వస్తున్నారని సమాచారం ఉంది. ఇదే సమయంలో శిశుగృహ, సేవాసదనాలు పరిశీలించవచ్చు. అన్ని ప్రాజెక్టుల అధికారులు సెంటర్లు నడపాలని చెప్పలేదు. పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాజెక్టుల పరిధిలోని సెంటర్లను పరిశీలించవచ్చు. అది కూడా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నవి మాత్రమే. పిల్లలు తప్పకుండా ఉండాలనేమీ లేదు. భవనాలు, అక్కడి వసతులపై ఆరా తీసే అవకాశం ఉంది. ఇదంతా ముందు జాగ్రత్తగా చెప్పినదే’ అని తెలిపారు.