
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అంతా అనుకున్నట్టే జరిగింది.. టీడీపీ వర్గ విభేదాలు పతాకస్థాయికి చేరాయి. పీడీసీసీబీ(ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) గొడవ ఇందుకు వేదికైంది. బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌పై పాలకవర్గంలోని 15 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి సిద్ధపడ్డారు. నెల రోజులుగా చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న డైరెక్టర్లు అమీతుమీకి సిద్ధపడ్డారు. మంగళవారం గుంటూరు కార్యాలయంలో సహకారశాఖ కమిషనర్‌ను కలిశారు. ఈదరపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల ంటూ నోటీస్ అందించారు. తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. ఈదర తమను వంచించారని, తమకు తెలియకుండానే అజెండాలో అదనంగా తీర్మానాలు ప్రవేశపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. పీడీసీసీబీలో కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయని సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రిజిస్ట్రార్‌కు నివేదించారు. ఈ ఏడాది ఆగస్టు 22న జరిగిన పీడీసీసీబీ సమావేశంలో 26 అంశాలను తీర్మానాలుగా పెట్టిన చైర్మన్ అందరి తో సంతకాలు చేయించుకొని సభ్యులకు తెలియకుండానే 9 ఆర్థిక అంశాలతో కూడిన తీర్మానాలను జత చేసి ఆమోదం పొందినట్లు చేసుకున్నారని డైరెక్టర్లు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు.
దీని ద్వారా కోట్లాది రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయని వారు రిజిస్ట్రార్ దృష్టికి తెచ్చారు. దీంతో చైర్మన్‌పై తమ విశ్వాసం కోల్పోయినట్లు చెప్పారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తున్నట్లు రిజిస్ట్రార్‌కు వివరించారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 15 మంది డైరెక్టర్లు చైర్మన్ ఈదర మోహన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంపై సహకార శాఖ రిజిస్ట్రార్ జె.మురళీని ప్రశ్నించగా డైరెక్టర్లు చైర్మన్‌పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన మాట నిజమేనన్నారు. 4.30 గంటల ప్రాంతంలో తనను కలిసిన డైరెక్టర్లు చైర్మన్‌పై తమ విశ్వాసం కోల్పోయినందున అవిశ్వాసం నోటీస్ ఇస్తున్నట్లు చెప్పారన్నారు. డీసీసీబీలో జరిగిన అక్రమాలపైనా డైరెక్టర్లు వినతిపత్రం ఇచ్చారన్నారు. వారిచ్చిన నోటీస్‌ను మంగళవారమే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు.
టీడీపీ వర్సెస్ టీడీపీ..
పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌కు పాలకవర్గంలోని మెజార్టీ డైరెక్టర్ల మధ్య వివాదం రోడ్డునపడిన నేపథ్యంలో దీనిని సర్దుబాటు చేయాలంటూ గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు బ్యాంకు గొడవను సర్దుబాటు చేస్తామంటూ మంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మిగిలిన ప్రజాప్రతినిధులు చెప్పినా పది రోజులుగా ఎటూ తేల్చక నాన్చుడి ధోరణితో వ్యవహరించారు. అయినా 15 మంది డైరెక్టర్లు వెనక్కి తగ్గలేదు. అక్రమాలకు పాల్పడ్డ చైర్మన్‌ను పదవి నుంచి తప్పించాలంటూ మంత్రి, జిల్లా అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, గొట్టిపాటి రవికుమార్ తదితరులను కలిసి విన్నవించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌కు మద్ధతు పలికినట్లు సమాచారం. ఇక చైర్మన్ ఈదర మోహన్‌తో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్లకు వ్యతిరేకత ఉన్నప్పటికీ జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాదనలేక మిన్నకుండిపోయారు.
దీంతో చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్న 15 మంది డైరెక్టర్లు ఇక నేతలతో పంచాయితీ తెగదని అమీతుమీకి సిద్ధపడ్డారు. మంగళవారం ఏకంగా సహకార శాఖ రిజిస్ట్రార్‌ను కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కాదని అధికార పార్టీకి చెందిన 15 మంది డైరెక్టర్లు చైర్మన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులివ్వడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో వర్గపోరును ఇది తేటతెల్లం చేసింది. డైరెక్టర్ల అవిశ్వాసం నోటీస్ నేపథ్యంలో పార్టీ అధిష్టానం సహకార శాఖ మంత్రి, రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి పెంచి అవిశ్వాస తీర్మానం నోటీసుపై తదుపరి చర్యల్లేకుండా అడ్డుకునే అవకాశం ఉందన్న ప్రచారమూ సాగుతోంది. రిజిస్ట్రార్ మాత్రం నిబంధనల మేరకు తదుపరి చర్యలుంటాయని పేర్కోనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఏం జరుగుతుందోనన్నది వేచి చూడాలి.
ఆర్థిక నేరగాళ్ల పనే ఇది: చైర్మన్ ఈదర మోహన్
కొందరు ఆర్థిక నేరగాళ్లు తోడై తనపై అవిశ్వాసం నోటీసులిచ్చారని పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస నోటీస్ విషయం తెలుసుకున్న ఆయన సాక్షితో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపైనా 51 ఎంక్వయిరీ కాకుండా మొత్తం బ్యాంకుపైనే న్యాయవిచారణకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక నేరాల్లో భాగస్వాములుగా ఉండి సస్పెండ్, డిస్మిస్ అయిన కొందరు ఉద్యోగులు, కొందరు డైరెక్టర్లు కలిసి బ్యాంకును అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు క్షేమం కోసమే తాను ఇంత వరకు ఆలోచించానన్నారు. ఇక తాను కూడా ఉపేక్షించనని మొత్తం వ్యవహారాన్ని సీఎం, సహకార శాఖ మంత్రి, ఉన్నత స్థాయి అధికారులందరికీ వివరిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment