- నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా చర్యలు
- ఏ గుర్తింపుకార్డు లేకపోయినా సరకులు
- ఎమ్మెల్యే లేదా జన్మభూమి కమిటీ లేఖ తప్పనిసరి
- వస్తువుల సరఫరాపై విజిలెన్స్ నిఘా
- నేడు లక్ష మందికి సరకుల పంపిణీ
విశాఖ రూరల్: రేషన్ కార్డు లేని వారికి ఫొటో తీసి నిత్యావసర సరకులు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. సరకులు పక్కదారి పట్టకుండా, తీసుకున్న వారే మళ్లీ తీసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినప్పటికీ... స్థానిక ఎమ్మెల్యే లేదా జన్మభూమి కమిటీల నుంచి లేఖ తీసుకువస్తే సరకులు అందజేస్తారు. ఆ లేఖలను పరిశీలించడంతో పాటు రేషన్ దుకాణంలో ఫొటోగ్రాఫర్‌తో అభ్యర్థికి ఫొటో తీసిన తరువాత వస్తువులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇందుకోసం 400 మంది ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇచ్చారు. సోమవారం ఒక్క రోజే నగరంలో లక్ష మంది కార్డులు లేని వారికి సరకులు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి రేషన్ షాపునకు 200 నుంచి 400 మందికి సరిపడా సరకులు పంపిణీ చేశారు.
విజిలెన్స్ నిఘా: హుదూద్ తుపాను కారణంగా 13 లక్షల మంది నష్టపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో తెలుపు, గులాబీ కార్డులు ఉన్న సుమారు 12 లక్షల మందికి ఇప్పటికే సరకులు పంపిణీ జరుగుతోంది.
ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వలస వచ్చిన వారు, కార్డులు లేని వారు లక్ష మంది వరకు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారందరికీ సోమవారం రేషన్ దుకాణాల ద్వారా సరకులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులు, ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా సరకులు ఇస్తుండడంతో ఇవి కొంత పక్కదారి పట్టే అవకాశాలు ఉండడంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విజిలెన్స్ బృందాలను అదనంగా జిల్లాకు రప్పిస్తున్నారు.
రెండో సారి సరకులు తీసుకుంటే చర్యలు
తొలుత గుర్తింపు కార్డులు చూపిస్తే సరకులు ఇవ్వాలని భావించినప్పటికీ... తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒక కుటుం బంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు గుర్తింపు కార్డులు చూపించి సరకులు తీసుకొనే అవకాశముండడంతో ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీల నుంచి లేఖలను తప్పనిసరి చేశారు. ఎమ్మెల్యేల నుంచి ఈ లేఖలు పొందలేని వారు జన్మభూమి కమిటీల నుంచయినా లేఖ తీసుకుంటే సరకులు ఇస్తారని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు.
ఎవరూ రెండోసారి రేషన్ తీసుకొనే అవకాశంలేకుండా ఆ లేఖలను పరిశీలిస్తారు. ఆ లేఖల్లో లబ్ధిదారుడితో పాటు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోను కూడా జత చేయనున్నారు. తెలుపు, గులాబీ కార్డుదారులు ఎవరైనా మళ్లీ సరకులు తీసుకోడానికి వస్తే ఫోటోల ఆధారంగా గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.