మద్యం మత్తులో కారు నడపడం వల్లే దుర్ఘటన
వేధింపులు, సెటిల్‌మెంట్ల ఆరోపణలకు ఆధారాల్లేవు
లావణ్య మృతి కేసులో సీపీ యోగానంద్ వెల్లడి
ఇద్దరు నిందితులు హేమకుమార్, హేమంత్‌ల అరెస్ట్
విశాఖపట్నం: సంచలనం సృష్టించిన లావణ్య మృతి సంఘటనను రోడ్డు ప్రమాదంగా పోలీసులు తేల్చేశారు. పోకిరీలు ఆమెను వేధించి, కావాలనే కారుతో గుద్దించి హత్య చేశారని వచ్చిన ఆరోపణలను నిర్థారించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ చెప్పారు. కమిషనరేట్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదానికి కారకులైన దాడి హేమకుమార్, బొడ్డేడ హేమంత్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసును అడిషనల్ సీపీ సత్తార్‌ఖాన్, డీసీపీ (క్రైమ్) రవికుమార్‌మూర్తి విచారణ జరపగా.. తాను కూడా నూకాంబిక ఆలయానికి వెళ్లి విచారించాన న్నారు. ఆలయంలో 22 సీసీ కెమెరాలుండగా 7 కెమెరాల్లో లావణ్య దృశ్యాలు రికార్డయ్యాయని, ఎక్కడా నిందితులు ఆమెను వెంబడించినట్లు గానీ, వేధించినట్లు గానీ లేదని వివరించారు. వేధింపులకు పాల్పడి లావణ్యను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారనడానికి ఆధారాలు లభించలేదన్నారు. ఈ కేసులో రాజకీయ జోక్యం, సెటిల్‌మెంట్లు ఉన్నట్లు చిన్న ఆధారం లభించినా వెంటనే చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. సీపీ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
గాజువాక సమీపంలోని వడ్లపూడికి చెందిన మాటూరి లావణ్య, వారి కుటుంబ సభ్యులు మొత్తం పది మంది కలిసి ఈ నెల 22న అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం కోసం మోటార్ సైకిల్, టాటా ఎస్ వాహనాల్లో వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమ్మవారి దర్శనం అనంతరం అప్పలరాజు తన ఇద్దరు పిల్లలు వెంకటరావు, మురళీలను తీసుకొని వారి సొంత టాటా ఏస్ (ఏిపీ31 టీటీ 5676)లో ఇంటికి వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కర్రి మోహన్‌కుమార్, దివ్య, లావణ్యలు పల్సర్ మోటార్ సైకిల్(ఏపీ 31 సీఎల్ 0726)పై ఇంటికి బయలుదేరారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వారి వెనకనే షేర్ ఆటోలో వడ్లపూడికి బయలుదేరారు.
కారుతో ఇబ్బందిపెట్టారు
అదే సమయంలో నూకాంబిక ఆలయం నుంచి బయల్దేరిన లావణ్య తదితరులు ప్రయాణిస్తున్న బైక్ సిరసపల్లి వద్ద వారికి తారసపడింది. కారు నడుపుతున్న హేమకుమార్ అదే పనిగా హారన్ కొడుతూ మోటార్ బైక్ ముందుకు వెనక్కీ తీసుకెళ్తూ ఇబ్బంది పెట్టాడు. ఆ సమయంలో హేమకుమార్ డ్రైవింగ్ చేస్తూ ఫోనులో మాట్లాడుతున్నాడు. అదే క్రమంలో సాయంత్రం 4.40 గంటల సమయంలో మోటార్ బైకును కారు వేగంగా ఢీకొట్టింది. మోహనకుమార్, దివ్య కిందపడిపోయారు. లావణ్య కారు బానెట్‌పై పడింది. అయినా హేమకుమార్ కారును ఆపకుండా బైకును, లావణ్యను 75 మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్లాడు. లావణ్య బానెట్‌పై నుంచి కిందపడి తలకు బలమైన గాయమై చనిపోయింది. మోహన్‌కుమార్, దివ్యలు గాయాలతో బయటపడ్డారు. హేమకుమార్ అప్పటికీ కారు ఆపకుండా కేసును పక్కదారి పట్టించే ఉద్దేశంతో లంకెలపాలెం జంక్షన్ నుంచి పరవాడ వెళ్లి అక్కడి తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి 51 మీటర్లు లోపలికి వెళ్లి కొండ వాలు వద్ద కారు ఆపాడు. హేమకుమార్, హేమంత్‌లు కలిసి కారు ముందు వెనుక నెంబర్ ప్లేట్లు తీసి కారులో పడేసి.. కారును అక్కడే వదిలి పరారయ్యారు.
రాత్రి 9 గంటలకు ఫిర్యాదు
అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో వడ్లపూడి ఆర్ హెచ్ కాలనీకి చెందిన మాటూరి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదుపై పరవాడ ట్రాఫిక్ ఎస్సై ఐపీసీ 304-ఎ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వెర్నా కారును స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన తర్వాత హేమకుమార్ తాగిన మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు, లావణ్య మృతికి కారకుడైనట్లు, సాక్ష్యం లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ముందుగా పెట్టిన సెక్షన్లను మార్చి వారిరువురిపై ఐపీసీ 304-2, 337, 201 సెక్షన్లు, 134 (ఎ)(బి) రెడ్‌విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపారు. నిందితులిద్దరినీ సోమవారం ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.
నిందితులు పార్టీలో ఉన్నారట!
మరోవైపు అదే రోజు అనకాపల్లి ఎస్‌ఆర్ రెసిడెన్సీ రూమ్ నెం.315లో పడాల అప్పలరాజు అనే వ్యక్తి తన పెళ్లి రోజు సందర్భంగా పార్టీ ఇచ్చాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసే దాడి హేమకుమార్, బుద్దా శ్రీనివాసరావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, వి.రవి, సూరిశెట్టి రాము, బొడ్డేడ హేమంత్, కర్రి రాంప్రసాద్‌లు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఎనిమిది మంది కలిసి ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకూ హో టల్ గదిలోనే మద్యం సేవించారు. అనంతరం హేమకుమార్, హేమంత్‌లు విశాఖ జ్ఞానాపురంలో డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లాలనుకోగా తాగి ఉన్నందున కారులో వెళ్లడం మంచిది కాదని స్నేహితులు వారించారు. అయినా వినకుండా వారిద్దరూ తెల్ల వెర్నా కారు (ఏపీ 31 సీఎన్ 6666)లో సాయంత్రం 4 గంటలకు విశాఖ బయలుదేరారు.