జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాల ఏఎస్పీ రమారాజేశ్వరి అదనపు ఎస్పీగా పదోన్నతిపై నల్గొండకు బదిలీ కావడంతో ఆమె స్థానంలో ఎవరు వస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మళ్లీ ఐపీఎస్ అధికారిని వేస్తారా? లేక డీఎస్పీని నియమిస్తారా? అనే చర్చ ఇటు పోలీసు వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో, మరోవైపు ప్రజల్లో జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఐపీఎస్ అధికారిని వద్దంటున్నారు.
డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఐపీఎస్ అధికారి కఠినంగా వ్యవహరిస్తే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, డీఎస్పీ స్థాయి అధికారిని అయితే అన్ని విధాలా మేనేజ్ చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో డీఎస్పీ నియమించాలని మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా డీజీపీపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవల పదకొండు మంది యువ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకొని పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఒకరిని జగిత్యాల ఏఎస్పీగా నియమించాలని డీజీపీ ప్రసాదరావు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై మంత్రి శ్రీధర్‌బాబును సంప్రదించగా, ఆయన డీఎస్పీ స్థాయి అధికారినే నియమించాలని పట్టుబడుతున్నట్లు వినిపిస్తోంది. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేనంటే నేనంటున్న డీఎస్పీలు
జగిత్యాల డీఎస్పీగా వచ్చేందుకు చాలాకాలంగా నలుగురు డీఎస్పీలు పోటీపడుతున్నారు. రమారాజేశ్వరి ఆరు నెలల క్రితమే బదిలీ అవుతారనే ప్రచారం జరిగినప్పటినుంచి ఈ పోస్టుపై డీఎస్పీలు ఆశలు పెంచుకున్నారు.
హైదరాబాద్ ఆర్టీసీలో డీఎస్పీగా పనిచేస్తున్న హబీబ్‌ఖాన్, కరీంనగర్ సీఐడీ డీఎస్పీ భాస్కర్, వరంగల్ సీఐడీ డీఎస్పీ సంజీవరావు జగిత్యాల వచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రమారాజేశ్వరి నల్గొండకు బదిలీ అవుతుండడంతో నిజామాబాద్ ఏసీబీలో పనిచేస్తున్న ఎస్.సంజీవరావు, హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ సాయిమనోహర్, హైదరాబాద్‌లో సీసీఎస్‌లో పనిచేస్తున్న రామారావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మంత్రి శ్రీధర్‌బాబుతో కొందరు డీఎస్పీలు జగిత్యాల పోస్టింగ్‌కు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు మంత్రులు, డీజీపీ బంధువర్గంతో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడికి ఐపీఎస్ వస్తారా? డీఎస్పీ వస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఏడీ ఎస్పీయా?
Published Sat, Nov 16 2013 2:25 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement