వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు | Joy Of Unemployed With Replacement Of Volunteer Posts | Sakshi
Sakshi News home page

సంతోషం.. కొలువు! 

Published Sun, Aug 4 2019 8:02 AM | Last Updated on Sun, Aug 4 2019 8:02 AM

Joy Of Unemployed With Replacement Of Volunteer Posts - Sakshi

వార్డు వలంటీర్‌గా ఎంపికైన యువతికి నియామక పత్రం అందజేస్తున్న మున్సిపల్‌ ఆర్‌డీ, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ అలీంబాషా

సాక్షి, అనంతపురం న్యూసిటీ: నిరుద్యోగుల కల ఫలించింది. ఏ పనీలేక ఇంట్లో వారికి భారమైన వారికి ఆ బాధ దూరమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వార్డు వలంటీర్ల పోస్టులను భర్తీ చేయడంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. శనివారం జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల్లో వార్డు వలంటీర్లుగా ఎన్నికైన వారికి ఆయా కమిషనర్లు నియామక పత్రాలను అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని వారు ఆనందంలో తేలిపోయారు.  

కిక్కిరిసిన నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలు 
జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థ వార్డు వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులతో కిక్కిరిపోయింది.  ఉదయం 8 గంటల నుంచే నియామక పత్రాలిస్తారని వార్డు వలంటీర్లు ఎదురుచూశారు. నియామకపత్రాలకు సంబంధించి ఈ నెల 2న ఆయా మునిసిపాలిటీల అధికారులు మెసేజ్‌లు పంపారు. దాని ఆధారంగా ఏఏ ప్యానెల్‌లో వారు ఇంటర్వ్యూలకు హాజరయ్యారో అక్కడే నియామకపత్రాలు తీసుకున్నారు. మునిసిపల్‌ ఆర్‌డీ, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ అలీంబాషా, తదితర అధికారులు ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఏసీ చెన్నుడు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస రావు, ఏసీపీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
 
20979 నియామక పత్రాలు 
అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మునిసిపాలిటీల్లో మొత్తం 20,979 మందికి నియామక పత్రాలను అందజేసిన ట్లు మునిసిపల్‌ ఆర్‌డీ అలీంబాషా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల్లో 5,465 మందికి నియామకపత్రాలు అందజేశామన్నారు. వీరికి ఈ నెల 6 నుంచి 9 వరకు శిక్షణ ఉంటుందని, శిక్షణ కేంద్రాల వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.  

ఇంటి వద్దకే సేవలు  : మంత్రి శంకరనారాయణ
పెనుకొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర బీసీసంక్షేమ శాఖామాత్యులు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన మండల పరిషత్‌ భవనంలో వలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదట సారిగా గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్‌ల వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక నేత జగనేనన్నారు. ప్రజలు తమ పనులపై ప్రభుత్వకార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా వారి ఇంటి వద్దే సేవలు అందించేందుకు సీఎం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 72 గంటల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. 

పారదర్శకంగా పాలన 
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని మంత్రి విమర్శించారు. పాలనలో పారదర్శకత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని, నిజాయితీగా పని చేయాలని సూచించారు. ఎంపీడీఓ శివశంకరప్ప, కార్యదర్శి అశ్వర్థప్ప,  మండల కన్వీనర్‌లు శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు,  లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ నాగలూరుబాబు, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాలరెడ్డి, టౌన్‌ కన్వీనర్‌ తయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.  

కొలువుల జాతర
12,373 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు 
అనంతపురం టవర్‌క్లాక్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్ల నియామకం పూర్తయ్యింది. జిల్లాలో 896 గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగా, ఇంకా వాటి సంఖ్య పెంచుతూ 912 సచివాలయాలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మొత్తం 14,007 వలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 15,218 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపారు. నిరుద్యోగుల నుంచి ఏకంగా 58,382 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 56,707 మంది అర్హత సాధించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 12,737 మందిని గ్రామ వలంటీర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ శోభాస్వరూపరాణి తెలిపారు. 

సీఎం దేవుడిలా అవకాశం ఇచ్చారు 
టైలర్‌ పని చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నా. ప్రభుత్వ పథకాల్లో  కీలకంగా వ్యవహరించే అవకాశం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాకు కల్పించారు. ఉద్యోమంటే మాలాంటోళ్లకు సాధ్యపడదని అనుకున్నాం. ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తా. 
 – ద్వారకనాథ్, ఓబుళదేవనగర్‌   

అదృష్టంగా భావిస్తున్నా 
వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. ఉపాది లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధి కల్పించడం మాలాంటి నిరుద్యోగులకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్థికంగా ఊరట లభిస్తుంది.         – రాశి, నేతాజీ నగర్‌  

హామీ నిలబెట్టుకున్నారు  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తరహాలో ఇచ్చిన మాట తప్పలేదు. వార్డు వలంటీర్లు, సెక్రటేరియట్లలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడం సీఎం గొప్పతనమే. వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది.          
– శ్రీ బాలాజీ, జీసస్‌నగర్‌ 

ధన్యవాదాలు 
వార్డు వలంటీర్లుగా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్‌కు ధన్యవాదాలు. విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళలకు ఆయన సముచిత స్థానం కల్పిస్తున్నారు. మహిళా సాధికారతకు ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగాలు దోహదపడతాయి.   
–స్రవంతి, నీరజ అంబేద్కర్‌నగర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement