దోషులని తేలితే మేమే ఆహుతవుతాం | kapu leaders blames on ap cm chandra babu | Sakshi
Sakshi News home page

దోషులని తేలితే మేమే ఆహుతవుతాం

Published Thu, Feb 4 2016 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

దోషులని తేలితే  మేమే ఆహుతవుతాం

దోషులని తేలితే మేమే ఆహుతవుతాం

 అమలాపురం టౌన్: తుని కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో కాపు నేతల ప్రమేయం, పాత్ర ఉన్నట్టు రుజువైతే దోషులుగా చట్టం శిక్షించనవసరం లేకుండా తమకు తామే ఆత్మాహుతై స్వీయ శిక్షలు విధించుకుంటామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. కాపు నేత, అమలాపురానికి చెందిన దివంగత నల్లా సూర్య చంద్రరావు స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, ఉపాధ్యక్షుడు బీఎల్ నరసింహారావు (ఏలూరు), రాష్ట్ర కాపు ఐక్య సంఘటన కన్వీనర్ ఇమ్మిడి సత్యనారాయణ (చిలకలూరుపేట) మాట్లాడారు. తుని విధ్వంసంలో అసాంఘిక శక్తులెవరో ప్రభుత్వమే తమ విచారణలో గుర్తించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని  కోరుతూ, అప్పుడే  వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో టీడీపీకి చెందిన కాపు నాయకులతో సమావేశం నిర్వహించి కాపు ఉద్యమం, డిమాండ్లపై చర్చించామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొన్నటి వరకు కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న, తుని సభకు అడ్డంకులు సృష్టించిన వారితో మాట్లాడి కాపు నాయకులతో మాట్లాడానని చెప్పుకోవడం చంద్రబాబుకు సరికాదన్నారు. టీడీపీ కాపు నేతలతో కాకుండా, కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులతో ఆయన మాట్లాడితే సమస్యకు మూలం తెలిసి పరిష్కారం లభిస్తుందని సూచించారు.

 ఎక్కడికక్కడ శాంతియుతంగానే దీక్షలు
 కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన ఇంటి వద్ద శుక్రవారం నుంచి  చేపడుతున్న ఆమరణ దీక్షకు మద్దతుగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ కాపు నాయకులు శాంతియుతంటా ఆమరణ దీక్షలు చేపట్టనున్నారని వారు చెప్పారు. దీక్షల కోసం కాపులు మళ్లీ రోడ్లపైకి ఎక్కితే అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కాపులు నివసించే వీధుల్లో  ఒక కూడలి వద్ద లేదా ఆలయాల వద్ద ఆమరణ దీక్షలకు దిగుతామని చెప్పారు. కొందరు కాపులు ఉమ్మడిగా తమ ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టేలా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు.  విలేకరుల సమావేశంలో కాపు నాయకులు నల్లా పవన్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, దివంగత కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు తనయులు నల్లా అజయ్, సంజయ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement