సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: రూరల్ మెడికల్ ప్రాక్టీషినర్లు(ఆర్‌ఎంపీ)ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చెప్పారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవ సమావేశం ఆదివారం స్థానిక బి.క్యాంపులోని ఆఫీసర్స్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే టి. ఆర్థర్ హాజరై ప్రసంగించారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ వైద్యుల సేవలు గుర్తించి జీవో నెం.429 ద్వారా సామాజిక ఆరోగ్య కార్యకర్తగా గుర్తించి ప్రభుత్వ శిక్షణ ఇచ్చారన్నారు. అయితే అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని తెలిపారు. వీరికి తిరిగి శిక్షణ ఇస్తే గ్రామీణ ప్రాంతంలో ప్రథమ చికిత్స అందించే వీలుంటుందని తెలిపారు. దీనికి ఎమ్మెల్యేలు స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లో ప్రజలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్. ఉస్మాన్, డి. దస్తగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారి జె. రఘునాథ్‌రెడ్డి, గౌస్, నాగరాజు, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment