రేపు కేసీఆర్, చంద్రబాబు భేటీ
హైదరాబాద్: నాగార్జున్ సాగర్ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదరడంతో.. సమస్యను పరిష్కారించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. చంద్రబాబు కేసీఆర్కు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకోసం శనివారం ఉదయం 10 గంటలకు ఇద్దరూ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు.
నాగార్జున సాగర్ వద్ద మోహరించిన తెలంగాణ పోలీసులను ఉపసంహరించుకుంటామని కేసీఆర్ చంద్రబాబుకు చెప్పారు. అలాగే సాగర్ వద్ద ఏపీ పోలీసులు సంయమనంతో వ్యవహరించేలా చూడాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి పరస్పర సహకారం అవసరమని కేసీఆర్, చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు ఏపీ ఇరిగేషన్ అధికారులు రాగా, తెలంగాణ అధికారులు అడ్డుపడ్డారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు హరీష్ రావు, ఉమా మహేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. చివరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకున్నారు. సాగర్కు నల్లగొండ, గుంటూరు ఎస్పీలు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చలు జరిపారు.