కష్టాల జ్వాలలు దహించగా, ఆ మంటలు దాటి ధగధగ్గాయమానంగా ప్రకాశించిన మేలిమి బంగారం ఆయన.. కాలమనే కళాకారుడు చిత్రరీతుల్లో తీర్చిదిద్ది...
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కష్టాల జ్వాలలు దహించగా, ఆ మంటలు దాటి ధగధగ్గాయమానంగా ప్రకాశించిన మేలిమి బంగారం ఆయన.. కాలమనే కళాకారుడు చిత్రరీతుల్లో తీర్చిదిద్ది, నగిషీలు పెట్టి మెరుపులు మెరిపించిన అపురూప సాహితీ ఆభరణం ఆయన.. ఆ నగ తెలుగు సాహితీమూర్తి నుదుటన తళుక్కున మెరిసింది. ఆ అమూల్యాభరణం తెలుగుతల్లికి ఎనలేని కీర్తిప్రతిష్టల వెలుగులు తెచ్చింది.
బతుకుబాటలో ఎదురైన కష్టనష్టాలను ఓర్మితో సహించి, నిరుపమాన సాహితీకృషి సాగించిన దిగ్దం తుడు రావూరి భరద్వాజ చల్లిన వెలుతురు చినుకులతో ఆంధ్ర సాహితికి సువర్ణాభిషేకం జరిగింది. ఈ నిరుపమాన ప్రతిభావంతుడు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస వీడిన ట్టు తెలిసిన మరుక్షణం ఆయన ఆత్మీయ స్మృతులతో విశాఖ మమేకమైంది. గతనెల 21నే విశాఖలో రావూరికి మమతానురాగాలు కలబోసిన సహృదయ సత్కారం జరిగిన ఘట్టం విశాఖ సాహితీప్రియుల మదిలో మెదిలింది.
ఈ సత్కారం సంగతి అటుంచితే జీవనయానంలో అనేక బాటలు పట్టి, ఎన్నో మజిలీలు చేసిన రావూరికి విశాఖతో, ఉత్తరాంధ్రతో ప్రగాఢానుబంధమే ఉంది. రావూరి సాహితీ సృజనకు గుర్తింపుగా ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారాన్ని ఇచ్చిన విశిష్టతను సొంతం చేసుకుంది. తర్వాతే ఆయనకు వివిధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు లభించాయి. విశాఖకు చెందిన లబ్ద ప్రతిష్టులు పురిపండా, రోణంకి వంటి వారెందరినో కలుసుకోవడంతో ఆయన సాహితీ ప్రతిభ మరింత వెలుగులీనింది. సుదీర్ఘ వ్యవధి తర్వాత విశాఖ వచ్చిన ఆయన ఈ అనుభవాలెన్నిటినో ‘సాక్షి’తో పం చుకున్నారు.
అవమానాలే తనను తీవ్ర సాహితీ కృషి సాగించేలా ప్రేరేపించాయని చెప్పారు. ఆనాడు తాను ఎదుర్కొన్న కష్టాలను ఆర్తితో వివరించి అవన్నీ తనకు అమితమైన ప్రేరణ ఇచ్చాయని చెప్పారు. ఆనాటికీ, ఈనాటికీ తేడా వివరిస్తూ ‘అప్పుడు నేను కష్టాలు పడ్డా.. ఆ రోజులు మేలిమి బంగారం.. ఇప్పుడు నేను సుఖంగానే ఉన్నా.. ఈ రోజులు రోల్డ్‌గోల్డ్’ అని చెప్పి ఒక్క వాక్యంలో జీవితానుభవాల సారాన్ని సాంతం చిరునవ్వుతో వివరించారు.
సంతాపం
రావూరి మృతిపట్ల సహృదయ సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ఆర్ స్వామి, శేఖరమంత్రి ప్రభాకర్‌రావు, మొజాయిక్ సంస్థ కార్యదర్శి రామతీర్థ, విశాఖ సాహితీ కార్యదర్శి కావలిపాటి నారాయణరావు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులు కొసనా, డాక్టర్ డి.వి సూర్యారావు, కొణతాల రాజు, చెన్నా తిరుమలరావులు..యూజేఎఫ్ అధ్యక్షుడు ఎంఆర్‌ఎన్ వర్మ సంతాపం తెలిపారు.