కిరణ్, బాబు కలిసిరావాలి
వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, అందుకు రాష్ట్రంలోని కాం గ్రెస్, టీడీపీ నేతలు కూడా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలోనైనా ‘సమైక్య తీర్మానం’ కోసం విభజన వల్ల నష్టపోయే ప్రాంత సభ్యులు ముందుకురావాలని కోరారు. శుక్రవారం తన నివాసంలో విజయమ్మ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సమైక్య తీర్మానం పార్లమెంట్‌లో, న్యాయస్థానాల్లో ఒక ఆయుధంలా పనిచేస్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు ముందుకు రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
సమైక్య రాష్ట్రం కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలకు ఆర్టికల్-3, 371(డీ)ల గురించి వివరించి వారి మద్దతు కూడగట్టారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయగలిగారని చెప్పారు. సమైక్యాంధ్రకోసం రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు జాతీయ మీడియాలో రాకుండా కాంగ్రెస్ మేనేజ్ చేసిందని విజయమ్మ విమర్శించారు. అరుుతే జగన్ పర్యటన ద్వారా రాష్ట్రంలోని పరిస్థితి దేశ వ్యాప్తంగా వెలుగులోకి వస్తోందన్నారు. దీం తో తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన పార్టీ లు కూడా జగన్ వినతి మేర కు ఆర్టికల్-3పై చర్చకు మద్దతిచ్చిన విషయం గుర్తుచేశారు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని విజయమ్మ చెప్పారు.
అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అసెంబ్లీలో ‘సమైక్య తీర్మానం’ చేయాలని జగన్ 4 నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నారని, సీఎం ముందుకు రాకపోవడంతో రూల్ 77 కింద నోటీసిచ్చామని తెలిపారు. బీఏసీలో తమ పార్టీ చాలా స్పష్టంగా సమైక్య తీర్మానం చేయాలని విన్నవించినా కాంగ్రెస్, టీడీపీలు ముందుకు రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాము సమైక్య తీర్మానంకోసం ఈ నోటీసు ఇచ్చినట్టు వివరించారు.
ముఖ్యమైన హోదాల్లో ఉన్న కిరణ్, బాబులు గదుల్లో కూర్చొని ఇరు ప్రాంతాల నేతలతో డ్రామాలు ఆడిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంటే, అవే ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు కూడా తెలుగు ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇచ్చిన నోటీసుల్లో సీమాంధ్ర కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, టీడీ పీ వారు నలుగురే సంతకాలు చేయడంలో మతలబేంటని ప్రశ్నించారు.
విభజనకు సహకరిస్తున్న కిరణ్, చంద్రబాబు
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బయటకు సమైక్యం అని చెబుతున్నా విభజనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారని విజయమ్మ చెప్పారు. ‘‘రూట్‌మ్యాప్‌లు ఇచ్చారు. మోసపూరితమైన ధోరణితో ఉద్యోగుల సమ్మెను విరమింపచేశారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామన్నా, వాటిని నిలుపుదల చేశారు.
అసెంబ్లీలో సీమాంధ్రుల బలం తగ్గడానికి కారణం కూడా కిరణే. సభలో 175 మంది సభ్యుల బలం ఉంటే వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నారనే నెపంతో 15 మందిపై అనర్హత వేటు వేశారు’ అని వివరించారు. చంద్రబాబు కూడా కిరణ్ మాదిరే విభజనకు అడుగడుగునా సహకరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించండంటూ లేఖ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇప్పుడేమో కొబ్బరికాయ, రెండుకళ్లు, ఇద్దరు కొడుకులంటూ ఏమేమో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేశారో, ఆయన సిద్ధాంతాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదని విమర్శించారు. తెలుగుజాతి భవిష్యత్తు దృష్ట్యా ఈరోజుకైనా చంద్రబాబు తన విభజన లేఖను ఉపసంహరించుకొని, సమైక్యం కోసం కృషి చేయాలని విజయమ్మ కోరారు. జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వాస్తవాలేంటో ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు. ‘ఎలాంటి తప్పు చేయకపోయినా కుట్రలు, కుతంత్రాలు చేసి జైలుకు పంపారు. తొంభై రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను కుట్రపూరితంగా అడ్డుకున్నారు. 16 నెలలు గడిచిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ వచ్చింది. అది కూడా తప్పేనా?’ అని అడిగారు.