'సమైక్య ' పోరు కొనసాగిస్తాం
వైఎస్ విజయమ్మ స్పష్టీకరణ సమైక్య తీర్మానం ప్రతిపాదనను అంగీకరించనందుకు బీఏసీని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. బిల్లుపై చర్చకు సంబంధించి స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం నిర్వహించిన బీఏసీ సమావేశాన్ని ఆమె మధ్యలోనే బహిష్కరించి బయటకు వచ్చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం తీర్మానం చేయాలన్న ప్రతిపాదనను బీఏసీలో అంగీకరించకపోవడంతో ఆమెతో పాటు పార్టీ ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం విజయమ్మ మీడియూ పారుుంట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, సుచరిత, గుర్నాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలరాజు, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. తమ పార్టీ తొలి నుంచీ చేస్తున్న సమైక్య తీర్మానం డిమాండ్‌నే బీఏసీ సమావేశంలో కూడా వినిపించామని విజయమ్మ చెప్పారు. ‘తీర్మానం చేయండి. తర్వాత చర్చ కావాలంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటుందని చెప్పాం. వాళ్లు సమైక్య తీర్మానం చేయడానికి ఒప్పుకోలేదు’ అని తెలిపారు. ‘ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడుగానీ.. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు గానీ ఒక సంప్రదాయం పాటిస్తూ వ చ్చారు.
ఈ అసెంబ్లీ ఎందుకు ఆ సంప్రదాయం పాటించదు?’ అని ప్రశ్నించారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్న తెలంగాణ ప్రాంత నేతలతో ఏకీభవిస్తూ ముఖ్యమంత్రి కూడా చర్చ పెట్టమనే చెప్పినట్లు తెలిపారు. చర్చ కొనసాగించాలనే ఆయన చెప్పారన్నారు. ప్రజల వద్ద మాత్రం తుపాన్‌ను ఆపలేకపోయినా, విభజనను ఆపుతానంటూ సీఎం ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. తాము మాత్రం సమైక్య తీర్మానం చేసిన తరువాతనే చర్చలో పాల్గొంటామని చెప్పామని విజయమ్మ వివరించారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లులో సభ్యులకు కావాల్సిన సరైన వివరాలేవీ లేవని ఆమె తెలిపారు. ‘బిల్లులో ఏవిధమైన సమాచారం లేదు. ప్రభుత్వ ఆదాయం ఎంత? ఉద్యోగాలకు సంబంధించిన సరైన వివరాలు ఏవీ అందులో లేవు’ అని అన్నారు. సమైక్య తీర్మానం చేసిన తరువాత చర్చకు వీలుగా అన్ని అంశాలపై అధ్యయనం చేయడానికి కనీసం నాలుగైదు రోజులు గడువు ఇవ్వాలని బీఏసీలో కోరినట్టు తెలిపారు.
అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు కూడా రెండు మూడురోజులు సమయం ఇస్తున్నారని, దీనికీ సమయం ఇవ్వాలని కోరామన్నారు. అరుునా ముఖ్యమంత్రి చర్చ పెట్టాల్సిందిగా చెబుతుండడంతో తాము బాయ్‌కాట్ చేసినట్లు తెలిపారు. శాసనసభలో సమైక్య తీర్మానం జరిగే వరకు తాము సభ జరగనివ్వబోమని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజల వద్ద సమైక్యాంధ్రప్రదేశ్ కోసం అన్నీ చేస్తామని చెప్పి, ఇప్పుడు వెనక్కి పోయారని విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సమైక్యం కోసం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రాల విభజనకు గతంలో ఉన్న సంప్రదాయాలను పాటించాల్సిందిగా ముఖ్యమంత్రిని కూడా కోరామన్నారు.
మండలిలోనూ పోరాటం: ఎమ్మెల్సీలు
రాష్ట్రం కలిసి ఉండాలని 75 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నందున శాసనమండలిలో విభజన బిల్లుపై చర్చకు ముందే సమైక్య తీర్మానం కోసం పట్టుబడతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. మంగళవారం మండలి వాయిదా పడిన తరువాత ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, తిప్పారెడ్డి, సి.నారాయణరెడ్డిలు మండలి మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోవడం వల్ల, రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల రాష్ట్రం విడిపోయే పరిస్థితులు వచ్చాయని వారన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అసెంబ్లీ, మండలిలో చర్చకు పెట్టకుండా ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి రేపటి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎలా చేస్తే అలాగే..
విభజన బిల్లు చర్చపై మండలి బీఏసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదాపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చకు చేపడతారన్న దానిని బట్టే మండలిలోనూ వ్యవహరించాలని శాసనమండలి సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. మండలి చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. బిల్లుపై చర్చ ప్రారంభించడానికి ముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మండలిలో తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు పట్టుపట్టారు. బిల్లును అధ్యయనం చేయడానికి తమకు తగినంత సమయం కావాలని డిమాండ్ చేశారు.