అద్వానీ చెప్పినట్లు ఉండేలా చూడాలి: విజయమ్మ
ఢిల్లీ: రాష్ట్రాల విభజనకు సంబంధించి గతంలో బిజెపి సీనియర్ నేత అద్వానీ చెప్పినట్లు ఉండేలా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కోరారు. విజయమ్మ తమ పార్టీ నేతల బృందంతో కలిసి రాజ్నాథ్తో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తరువాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకారం అందించమని రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు తెలిపారు.
రాష్ట్రాల విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానం, రెండో ఎస్సార్సీలను అనుసరించాలని గతంలో అద్వానీ చెప్పారని, అదేవిధంగా జరిగేట్లు చూడాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యాంగా ఉండడానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాము తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నామని, అయితే కాంగ్రెస్ పార్టీ అనుకరిస్తున్నది పద్దతిగా లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నట్లు ఆమె తెలిపారు. రాజకీయంపైన చర్చలు ఏమి జరగలేదని చెప్పారు. జగన్ దీక్ష విరమించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారన్నారు.
రాష్ట్ర ప్రజల కోసం జగన్ చేస్తున్న దీక్షను చూసి గర్విస్తున్నాన్నారు. తన కష్టాన్ని లెక్కచేయకుండా ఆయన జైల్లోనే నిరాహారదీక్షచేశాడని గుర్తు చేశారు. అప్పుడు ఆరోగ్యం బాగా క్షీణించిందని చెప్పారు. ఆరోగ్యం కుదుటపడేందుకు చాలా సమయం పట్టిందని, నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్షచేస్తున్నాడని వివరించారు. ఒక వైపు బాధగా ఉన్నప్పటికీ, ప్రజల కోసం జగన్ పడుతున్న తపనచూసి సంతోషంగా ఉందని చెప్పారు. బాధ్యతగల పార్టీకి నాయకుడిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. వైఎస్‌ఆర్ కూడా చివరి వరకూ ప్రజలు సమైక్యంగా,సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతా మంచే జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.